కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ మాజీ ఎంపి మహిళలను బెదిరించిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిరసన చేస్తున్న మహిళలను పరుష పదజాలంతో బిజెపి మాజీ ఎంపి దిలీప్ ఘోష్ దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. దిలీప్ ఘోష్ శుక్రవారం ఖరగ్‌పూర్‌లోని వార్డు నెం.6లో జరిగిన రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అయితే అక్కడ ఉన్న మహిళలు ఆయనను అడ్డుకున్నారు. ఎంపిగా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా అక్కడకు రాలేదని.. ఇఫ్పుడు వచ్చి ప్రారంభోత్సవంలో ఎలా పాల్గొంటున్నారని. అది కూడా తమ కౌన్సిలర్ ప్రదీప్ సర్కార్ నిర్మించిన రోడ్డును మీరు ఎలా ప్రారంభిస్తారు అంటూ నిలదీశారు.
దీంతో సహనం కోల్పోయిన దిలీప్ ఘోష్.. మహిళలపై విరుచుకుపడ్డారు. ‘ఈ రోడ్డు నిర్మాణానికి తనే డబ్బులు ఇచ్చానని.. మీ తండ్రి డబ్బులతో రోడ్డు వేయలేదని’ ఆయన అన్నారు. కావాలంటే ప్రదీప్ సర్కార్‌ని అడగండి అంటూ మండిపడ్డారు. అయితే మధ్యలో తండ్రి గురించి ఎందుకు మాట్లాడుతారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎంపి మీరు.. రోడ్డు వేయాల్సింది మీరే’ అని అన్నారు. దీంతో సంయమనం కోల్పోయిన దిలీప్.. ‘అలా అరవకండి.. గొంతు నులిమేస్తా’ అని హెచ్చరించారు. తాను ఎంపిగా ఉన్నప్పుడే తన ఎంపిలాడ్ ఫండ్ నుంచి ఈ రోడ్డుక నిధులు కేటాయించినట్లు తెలిపారు. మహిళలను ‘టిఎంసి కుక్కలు’ అని కూడా దూషించారు. దీంతో అక్కడే వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
మహిళలు, దిలీప్‌కి మధ్య వాగ్వాదం పెరిగిపోతుండటంతో.. భద్రతా సిబ్బంది ఆయన్ను వెంటనే కారు ఎక్కించారు. కానీ, మహిళలు ఆ కారును కదలనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ గందరగోళం మధ్యే దిలీప్ ఘోష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై టిఎంసి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.