గత ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఇవ్వలేకపోయిన కమలనాథులు
శ్రీధరన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్, వామపక్షాలు
తిరువనంతపురం: ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో మెట్రోమ్యాన్ శ్రీధరన్(88) తమ పార్టీలో చేరడం వల్ల బాగా కలిసి వస్తుందని బిజెపి అంచనా వేస్తోంది. 2016 ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వలేకపోయిన బిజెపి ఈసారి ఆ రాష్ట్రంపై ఆశలు పెంచుకుంటోంది. కేరళలో కొన్ని దశాబ్దాలుగా సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ మధ్యే అధికారం చేతులు మారుతూ వస్తోంది. మొత్తం 140 స్థానాలున్న కేరళలో గత ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు 91సీట్లు, యుడిఎఫ్‌కు 47 సీట్లు రాగా, బిజెపి ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. ఓట్‌షేర్‌లోనూ అంతగా ప్రభావం చూపలేదు. ఎల్‌డిఎఫ్‌కు 43.48శాతం, యుడిఎఫ్‌కు 38.81శాతం, బిజెపికి 14.96 శాతం ఓట్లు పోలయ్యాయి.
మెట్రోరైలు ప్రాజెక్టుల విషయంలో నిపుణుడిగా పేరున్న శ్రీధరన్ చేరికతో తమ పార్టీకి ఉన్నత విద్యావంతులు, మధ్యతరగతిలో ఓటు బ్యాంక్ పెరుగుతుందని బిజెపి అంచనా వేస్తోంది. శ్రీధరన్ చేరిక తమ పార్టీకి నైతిక బలాన్నిస్తుందని కేరళలో ఆ పార్టీ సీనియర్ నేత బి.రాధాకృష్ణమీనన్ అన్నారు. అభివృద్ధి అజెండాతో కేరళలో ప్రచారం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. శ్రీధరన్‌ను మంచి ఇంజినీర్ అంటూ కొనియాడిన సిపిఐ(ఎం), కాంగ్రెస్ నేతలు ఆయన బిజెపిలో చేరడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. శ్రీధరన్ నిర్ణయం తనకు ఎంతో బాధ కలిగించిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్‌చాందీ అన్నారు.
దేశ చరిత్ర పట్ల శ్రీధరన్‌కు అవగాహన లేదని సిపిఐ(ఎం) కేరళ ఇంచార్జ్ కార్యదర్శి ఎ.విజయరాఘవన్ అన్నారు. తెలివైన శ్రీధరన్ అవినీతి పార్టీలో చేరాలని ఎలా నిర్ణయం తీసుకున్నారని సిపిఐ నేత, రాజ్యసభ సభ్యుడు బినయ్‌విశ్వం ప్రశ్నించారు. తనకుతాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్న శ్రీధరన్‌ను ప్రజలు ఎలా విశ్వసిస్తారని రాజకీయ విశ్లేషకుడు, కేరళ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ జె.ప్రభాష్ అన్నారు. కేరళలోని కాసరగోడ్‌లో ఆదివారం బిజెపి ప్రారంభించే విజయ్‌యాత్ర సందర్భంగా శ్రీధరన్ ఆ పార్టీలో చేరనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు.