Sunday, January 12, 2025

వికటించిన ఆపరేషన్ కమలం

- Advertisement -
- Advertisement -

Kejriwal Mastermind in Excise Policy Scam: BJP

అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్, సిక్కిం, పుదుచ్చేరి, మహారాష్ట్ర ఇలా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో బిజెపి అక్రమంగా అధికారం చేజిక్కించుకొని పాలన సాగిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాలను కూల్చి అధికారం చేపట్టడమే కాకుండ సంపూర్ణ మెజారిటీ గల ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఇటీవల కవ్వింపు చర్యలకు పాల్పడి బోర్లాబొక్కల పడి ఆపరేషన్ కమల్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిఘటించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ కూల్చేందుకు ఎన్ని కుట్రలు చేసిందనేది గుర్తించాలి. బిజెపికి ఎనిమిది రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీ ఉండగా, ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి రాగ, పది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వాలను పంచుకున్న బిజెపికి రెండు రాష్ట్రాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేదు.

ఎనిమిది రాష్ట్రాల్లో పదిలోపు అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్న బిజెపి దేశ వ్యాప్తంగా 66% అసెంబ్లీ స్థానాలను కోల్పోయింది. దీన్నిబట్టి చూస్తే గోరంత బలాన్ని కొండంత బలంగా చూపించడంలో బిజెపి ఆరితేరిపోయిందనుకోవచ్చు. అంతేకాకుండా పలు రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తామని బిజెపి బహిరంగంగానే ప్రకటించడం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా ఖూనీ చేస్తుదనేది అవగతమవుతుంది.
ఓటు వేసి గెలిపించిన ప్రజలంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యం అంటే అసలే లెక్కలేదు, ఎంఎల్‌ఎలను కొనటం, ప్రభుత్వాలను పడగొట్టడం. లేదు కాదు కుదరదంటే సిబిఐ, ఇడి, ఐటి దాడులు చేయించడం బిజెపికి పరిపాటిగా మారిపోయింది. అవినీతి, అక్రమాల భరతం పట్టాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఐటి, ఇడి ఇతర పలు దర్యాప్తు సంస్థలను బిజెపి అధికారంలో లేని రాష్ట్ర ప్రభుత్వాలపై ఉసిగొల్పుతూ అధికారం చేపట్టాలనే అంతిమ లక్ష్యంలో దర్యాప్తు సంస్థలు పావులుగా పని చేయడం తీవ్ర విమర్శలకు తావివ్వడమే కాదు పలు ప్రాంతీయ, సంకీర్ణ ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది.

అవసరం అనుకుంటే వ్యతిరేకంగా ఉన్న ప్రజా ప్రభుత్వాలపై విషం చిమ్మి కూల్చడం, తమకు అనుకూలంగా ఉంటే ఎంత పెద్ద అవినీతిపరుడైనా బిజెపి పక్షాన నిలుస్తే నీతిపరుడై అధికారాన్ని అనుభవించవచ్చు. ఒకవేళ అదే అవినీతిపరుడు వ్యతిరేకమైతే అక్రమ ఆస్తులు, అవినీతి కుంభకోణాల కేసుల్లో దర్యాప్తు సంస్థల చర్యలు వెనువెంటనే ఉంటాయి. అందుకు తార్కాణం పశ్చిమ బెంగాల్లో 2014 సెప్టెంబర్ లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక శారదా కుంభకోణం కేసులో సువేందు అధికారిని సిబిఐ విచారిస్తే, 2017లో ఇడి విచారించింది. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు, కానీ ఆయన 2020లో బిజెపిలో చేరిన అనంతరం ఎలాంటి విచారణ లేదు. ప్రస్తుతం ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో మమత బెనర్జీపై గెలిచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అలాగే అసోంలోని గౌహతి నీటి సరఫరా కుంభకోణం కేసులో హిమంత బిస్వా శర్మ కీలక అనుమానితుడు. ఆనాడు ఆ కుంభకోణంపై వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను బిజెపి ప్రచురించింది. అయితే ఆ కేసును సిబిఐకి అప్పగించాలన్న తన స్వంత డిమాండ్‌ను శర్మ 2015లో బిజెపి గూటికి చేరాక తన డిమాండ్‌ను మర్చిపోయారు.

Amit-Shahs-And-Modi

ప్రస్తుతం ఆయన అసోం ముఖ్యమంత్రి ఉండడం గమనార్హం. 2017లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహన్‌కు వ్యాపం కుంభకోణం కేసులో సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అలాగే భూ కుంభకోణం, మనీలాండరింగ్ లాంటి అనేక కేసులను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణేను బిజెపిలో చేర్చుకుని రాజ్యసభ ఎంపిని చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగి ప్రభుత్వంలోని మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బిజెపికి షా కిచ్చి సమాజ్‌వాదీ పార్టీలో చేరితే ఎన్నికల అనంతరం ఆయనపై రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటున్నారు. అధికారం కోసం బిజెపి దర్యాప్తు సంస్థలను ఏ స్థాయిలో ఉపయోగిస్తుందో ఒకసారి సిబిఐ కేసుల వివరాలను పరిశీలిస్తే అవగతమవుతుంది.

2004 నుండి 2005 వరకు యుపిఎ హయాంలో 112 కేసులను విచారించిన సిబిఐ ఒక్క కేసును కూడా నిరూపించలేదు. కానీ 2014 నుండి నేటి వరకు ఎన్‌డిఎ హయాంలోని బిజెపి సిబిఐ ద్వారా 3010 కేసులలో సోదాలు చేసి కేవలం 23 కేసుల్లో నేరాన్ని నిరూపించింది అంటే బిజెపి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏ విధంగా, ఏ విషయం పట్ల వాడుతుందో అర్ధం అవుతుంది. ఇతర పార్టీలోని అవినీతిపరులు బిజెపిలో చేరితే ఎలా నీతివంతులవుతారో అర్థం కావట్లేదు. ఇక బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వేల కోట్ల కుంభకోణం జరిగినా ఏ దర్యాప్తు సంస్థ విచారణ కాదు కదా కనీసం నోటీస్ ఇచ్చేందుకు అటు వైపు కన్నెత్తి కూడా చూడదు. అందుకు నిదర్శనం కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల భారీ అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా సిబిఐ, ఇడి ఎలాంటి ఉలుకుపలుకు లేకుండా మెదలడం దర్యాప్తు సంస్థల చిత్తశుద్ధిని బహిర్గతం చేస్తున్నది.

ఇటీవల పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై బిజెపి దర్శకత్వంలోని సిబిఐ, ఇడి, ఐటి, రాష్ట్రాల బిజెపికి ప్రతినిధులుగా ఉన్న గవర్నర్లు రహస్యంగా ఆపరేషన్ కమలం అనే వ్యూహాన్ని రచించి దాన్ని అమలు చేసే సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిఘటించాయి. అందుకు నిదర్శనం ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు విశ్వాస పరీక్షలో నెగ్గి బిజెపిని ఇరకాటంలో పడేసిన విషయం ఒక ఎత్తైతే, బీహార్‌లో నితీశ్ కుమార్ చాణక్యంతో బిజెపి కూటమిని చీల్చి మహా ఘట్ బంధన్ కూటమితో కలిసి తన ముఖ్యమంత్రి పీఠాన్ని పదిలం చేసుకున్నారు.

ఢిల్లీలో ఆప్ నేతృత్వంలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఉండడం మింగుడు పడని బిజెపి తన అహంకారాన్ని కేజ్రీ ప్రభుత్వంపై ప్రదర్శిస్తూనే ఉంది. అందుకు నిదర్శనం గత కొన్నేళ్లుగా లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ సర్కారుకు సహాయ నిరాకరణ చేయడమే. దీనిపై కేజ్రీవాల్ పలుమార్లు గవర్నర్ నివాసంలో నిరసనకు దిగిన సన్నివేశాలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇక అంతిమంగా మహారాష్ట్రలో వెన్నుపోటుదారుడి ద్వారా ప్రభుత్వాన్ని కూల్చిన పథకం ఢిల్లీలో అమలు చేయాలని తలచి అందుకు ఢిల్లీ ప్రభుత్వంలో కేజ్రీ తరువాత స్థానంలో ఉన్న మనీష్ సిసోడియాను ఏకనాథ్ షిండే రూపంలో వాడి ఆప్ శాసన సభ్యులను రూ. 20 నుండి రూ. 25 కోట్లకు కొనుగోలు చేయాలని అందుకు నలుగురు ఎంఎల్‌ఎలను కూడా బిజెపి సంప్రదించడం ఆ పార్టీ దుర్బుద్ధి అర్ధమవుతుంది.

ఆప్ ఎంఎల్‌ఎలు కేజ్రీ సర్కార్ పక్షాన నిలబడటమే కాదు.. బిజెపికి బుద్ధి చెప్పేందుకు అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షకు వెళ్లి అందులో నెగ్గడం బిజెపి వక్ర బుద్ధికి కళ్లెం వేసిందని అనుకోవచ్చు. అందుకు ప్రతీకార చర్యగా గత రెండు రోజులుగా దర్యాప్తు సంస్థల విచారణను ఢిల్లీలో ముమ్మరం చేసి ఆప్ నేతలను భయాందోళనలకు గురి చేసింది. జార్ఖండ్‌లోని హేమంత్ సొరేన్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ విషయానికి వస్తే 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రం లో జెఎంఎం 30, కాంగ్రెస్ 18, ఆర్‌జెడి 01 స్థానాలతో సొరేన్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, 26 స్థానాలతో రెండో స్థానంలో ఉన్న బిజెపి అక్కడ సొరేన్‌ను గద్దె దించేందుకు సొరేన్ మైనింగ్ లీజ్ కేసులో అధికార దుర్వినియోగం చేశారని బిజెపి గవర్నర్ ద్వారా ఎన్నికల సంఘాన్ని నివేదిక కోరగా ఎన్నికల సంఘం తన నివేదికను సీల్డ్ కవర్లో పంపినట్లు తెలిపింది. కానీ ఆ నివేదిక సారాంశం సొరేన్ మీద అనర్హత వేటు పడుతుందని బిజెపి నేతలు ప్రకటించడం గమనార్హం.

సీల్డ్ కవర్లోని సారాంశం బిజెపి నేతలకు ఎలా తెలిసింది అంటే అది బిజెపి రూపొందించిన నివేదికే అని సొరేన్ ఘాటైన విమర్శలు చేశారు. జరుగబోయే ప్రమాదాన్ని అంచనా వేసిన సొరేన్ తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు.శాసన సభ్యులను బిజెపియేతర రాష్ట్రాలకు తరలించి అనుకూలమైన సమయంలో అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి వెళ్లి మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్షలో నెగ్గి తన ప్రభుత్వాన్ని పదిలం చేసుకున్నారు. అందుకు బిజెపి ప్రతి చర్యగా జార్ఖండ్ ఎంఎల్‌ఎలకు ఆశ్రయమిచ్చిన ఇచ్చిన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఏకకాలంలో దర్యాప్తు సంస్థలు మూడు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలపై దాడులు నిర్వహించడం బిజెపి కక్షపూరిత విధానాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, ప్రాణాల త్యాగ పునాదులపై ఆనాటి కేంద్ర సర్కారు మెడలు వంచి సాధించుకున్న తెలంగాణపై బిజెపి ఆది నుండి విషాన్ని చిమ్ముతూ వస్తున్నది. ఇటీవల పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అపహాస్యం చేసేలా తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని వ్యాఖ్యానించి తన కపట బుద్ధిని ప్రదర్శించింది.

తమ అవివేక నిర్ణయాలను నిరంతరం వ్యతిరేకిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర పాలకుడిగా ఉండడం నచ్చని బిజెపి తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను తెలంగాణలో దాడులకు సిద్ధం చేయగా, అందుకు ప్రతిగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు సందు ఇవ్వొద్దని తన పార్టీ నేతలకు కెసిఆర్ హిత బోధ కూడా చేశారు. కూల్చుడు రాజకీయంతో, రాష్ట్రాల హక్కులను కాలరాసే విధానంతో ముందుకు వెళ్తున్న బిజెపిపై కెసిఆర్ బిజెపి ముక్త భారత్ నినాదంతో మహా యుద్ధాన్ని ప్రకటించి జాతీయ రాజకీయాల్లోకి కెసిఆర్ అడుగుపెడుతున్నారు.
రాజస్థాన్‌లో కూడా సచిన్ పైలట్‌ను తమ వైపు తిప్పుకుని అధికారం పొందాలని చూసి ఆయన తిరస్కరించడంతో బిజెపి బోర్లాపడిన విషయం తెల్సిందే. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మమత ప్రభుత్వం రాకుండా వుండేందుకు పన్నాగం వేసి చావుదెబ్బ తిన్న బిజెపి మరలా ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై కన్నేసింది. అందుకు తార్కాణమే ఇటీవల దీదీ మేనల్లుడు అభిషేక్‌తో పాటు తృణమూల్ ప్రభుత్వంలోని మంత్రులు, పార్టీ నేతలపై దర్యాప్తు సంస్థల దాడులు.

అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా కూల్చేస్తామని ప్రకటించిన బిజెపి విధానం చూస్తుంటే.. దేశంలో ప్రభుత్వాలను కూల్చడంలో ఉన్న శ్రద్ధ రోజురోజుకీ పడిపోతున్న రూపాయి మారకం విలువను పెంచేందుకు ఒక నిర్మాణాత్మకమైన విధానాన్ని రూపొందించడంలో కనిపించకపోవడం బాధాకరమైన విషయం. ఇప్పటికే ప్రజాభీష్టానికి విరుద్ధంగా ఎనిమిది రాష్ట్రాల్లో పాగా వేసిన బిజెపి ఇకనైనా కూల్చుడు రాజకీయాలను బంద్ చేసి దేశ సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి సాధించాల్సిన ఆవశ్యకత ఉంది. బిజెపి చర్యలకు ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రతి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం పోసి, బిజెపికి త్వరలోనే బుద్ధి చెబుతాయి. కేవలం ఐదు సంవత్సరాల కోసమే ప్రజలు పాలకులను ఎంపిక చేసుకున్న విషయాన్ని గుర్తెరగాలి. ప్రజలు తల్చుకుంటే కూల్చడం కాదు కూకటివేళ్లతో పెకలిస్తారని తెలుసుకోవాలి.

పిన్నింటి
విజయ్ కుమార్
905203910

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News