న్యూఢిల్లీ : బిజెపి కేవలం మతతత్వాన్ని ప్రేరేపిస్తుందని, లవ్‌జిహాద్ సాకు చూపి భయపెట్టడం, ద్వేషపూరిత రాజకీయాలతో చీలికకు యత్నించడం ఇవన్నీ ప్లూరలిస్టు కేరళలో సాగబోవని సీనియర్ కాంగ్రెస్ నేత శశిధరూర్ వ్యాఖ్యానించారు. 88 ఏళ్ల ఉన్నత స్థాయి అధికారి ఇ. శ్రీధరన్‌ను ఎన్నికల్లో బిజెపి పోటీ చేయించడం కేరళ రాష్ట్ర భవిష్యత్తుకు జవాబు కాదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వం లోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలిచేవారు లేరన్న వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. యుడిఎఫ్‌లో అనుభవజ్ఞులైన, సామర్థం కలిగిన నేతలున్నారని, వారిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేరళలో రాజకీయ పరిణామాలు స్పష్టంగా యుడిఎఫ్‌కు అనుకూలంగా ఉందని, మే2న ఫలితాలు విడుదలైనప్పుడు గట్టి విజయం సాధిస్తుందని ఒక ఇంటర్వూలో ఆశాభావం వ్యక్తం చేశారు.