మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి మాత్రమే ఓటింగ్ శాతం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 14 శాతం ఓటు బ్యాంకును కైవసం చేసుకున్నట్లు గత ఎన్నికలతో పోలిస్తే తమ ఓటు బ్యాంక్ 100 శాతం పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. సోమవారం తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో అంచనాల కంటే ఎక్కువగా 8 స్థానాల్లో విజయం సాధించినట్లు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పెద్దఎత్తున డబ్బులు ఖర్చు పంపిణీ చేసిందని ఆరోపించారు.
రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజారిటీ ఇవ్వలేదన్నారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి చరిత్ర సృష్టించామన్నారు. కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఐదేళ్ల పోరాటమే ఈ ఫలితాన్ని ఇచ్చిందని కామారెడ్డి ఫలితం పట్ల జాతీయ నాయకత్వం హర్షం వ్యక్తం చేసిందన్నారు. 2024 కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోడీ హ్యాట్రిక్ సృష్టిస్తారన్నారు. నిరాశను దరి చేరనీయకుండా పట్టుదలతో మా లక్ష్యం కోసం ముందుకు సాగుతామన్నారు. అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించి వచ్చే ఐదేళ్లు క్రియాశీల, నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించి కేంద్రం, బిజెపిపై తప్పుడు ప్రచారం చేసిన నాయకులు ఓటమి చెందారని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి అదిష్టానానికి అన్ని విషయాలు వివరించి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించేవని, పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రతి ఒక్కరి సహాయం తీసుకుంటామని వివరించారు.