హొస్పేట: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నాయకుడు, కర్నాటక శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బికె హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీలోకి ఫిరాయించిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వేశ్యలుగా ఆయన అభివర్ణించారు. మంగళవారం నాడిక్కడి డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ స్టేడియంలో కెపిసిసి నిర్వహించిన ప్రజా ధ్వని యాత్రలో ఆయన ప్రసంగిస్తూ తన శరీరాన్ని అమ్ముకునే మహిళను వేశ్యలుగా పిలుస్తారని, అలాగే తమకు తాము అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను ఏమని అంటామని ప్రశ్నించారు.
అలాంటి ఎమ్మెల్యేలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు అస్పష్ట తీర్పు ఇచ్చి ఉంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఉండేదని, ఏదేమైనా కొందరు ఎమ్మెల్యేలు తమకు తాము అమ్ముడుపోయారని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పార్టీ ఫిరాయించి బిజెపి ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఇక్కడి ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పాలని హరిప్రసాద్ పిలుపు ఇచ్చారు.