దేశ ఆర్థిక వ్యవస్థపై పార్లమెంట్‌కు శ్వేతపత్రం సమర్పించిన మోడీ సర్కార్
యుపిఎ పాలనలో అంతా అస్తవ్యస్తం
మోడీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో మళ్లీ గాడిలోకి…
పదేళ్ల మోడీ పాలనపై కాంగ్రెస్ బ్లాక్ పేపర్
54 పేజీల చార్జిషీట్‌ను విడుదల చేసిన మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియచేస్తూ కాంగ్రెస పార్టీ గురువారం నల్ల పత్రాన్ని విడుదల చేసింది. గత పదేళ్లుగా దే శం ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవస్థల పతనం, బిజెయేతర రాష్ట్రాల పట్ల వివక్ష వంటి అంశాలలో అన్యాయాన్ని ఎదురొర్కుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం నాడిక్కడ 54 పేజీల చార్జిషీట్‌ను విడుదల చేశారు. పాఠాలు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో 2014కు ముందు దేశంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం పార్లమెంట్‌లో శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కాంగ్రెస్ మోడీ ప్రభుత్వంపై నల్ల పత్రాన్ని విడుదల చేయడం గమనార్హం. మోడీ ప్రభుత్వంపై తాము నల్ల పత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఖర్గే తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన ప్రతి సందర్భంలోను ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడరని, అసలు ఆ విషయాన్నే ప్రస్తావించరని ఖర్గే చెప్పారు.
నల్ల పత్రాన్ని విడుదల చేయడం ద్వారా ప్రజలకు మోడీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియచేయదలచామని ఆయన అన్నారు. పదేళ్ల మోడీ ప్రభుత్వంలో జరిగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్యాయాల ను బయటపెట్టడమే తమ ఉద్దేశమని ఆయన తెలిపా రు. మోడీ ప్రభుత్వ పదేళ్ల పాలనలో దేశం ఆర్థికంగా చితికిపోయిందని, నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చిందని, దేశ వ్యసాయ రంగం ధ్వంసమైందని, మహిళలపై నేరాలు పెరిగిపోయాయయని, మైనారిటీలకు తీరని అన్యాయం జరిగింనది నల్ల పత్రంలో కాంగ్రెస్ ఆరోపించింది. దేశం నిరుద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని, యువతకు ఉద్యోగాలు లేవని, కార్మికుల భాగస్వామ్యం తగ్గిపోయిందని ఆర్థిక అన్యాయానికి సంబంధిచిన అంశం లో కాంగ్రెస్ ఆరోపించింది.
పెరుగుతున్న ధరలపై మోడీ ప్రభుత్వం నోరు మెదపడం లేదని, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అం టుతున్నాయని కాంగ్రెస్ తెలిపింది. మోడీ ప్రభు త్వం 2016లో చేసిన పెద్ద నోట్ల రుద్దును ఘోర తప్పిదంగా కాంగ్రెస్ అభివర్ణించింది. ఘోరంగా విఫలమైన నోట్ల రద్దు నిర్ణయం అమలు జరిగి ఆరే ళ్లు దాటినా ఆర్థిక వ్యవస్థపై దాని దుష్ప్రభావాలు ఇంకా వెంటాడుతున్నాయని కాంగ్రెస్ తెలిపింది. రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి, కుల గణన చేయకపోవడం, మహిళలకు జరుగుతున్న అన్యాయాలను గురించి కూడా నల్ల పత్రం పేర్కొంది. ధరల పెరుగుదల గురించి అడిగితే జవహర్‌లాల్ నెహ్రూ, ఇంది రా గాంధీ గురించి మోడీ మటాడతారని, గత పదేళ్లుగా అధికారంలో ఉన్న వారే తాము ఏమి చేశామో సమాధానమివ్వాలని ఖర్గే డిమాండ్ చేశారు.యువతకు 2 కోట్ల ఉద్యోగాలు, రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) ఇస్తామని హామీ ఇచ్చింది మోడీయేనని, మాట నిలబెట్టుకోలేకపోయానని ప్రజలకు చెప్పుకోవలసిన ప్రధాని మోడీ ఇప్పుడు కొత్త హామీలను ఇస్తున్నారని ఆయన విమర్శించారు.
దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీయే 2024లో బిజెపి చీకటి పాలనను అంతం చేస్తుందని ఆయన ప్రకటించారు. బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకుందని ఆయన ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను బిజెపి ఉద్దేశపూర్వకంగానే పడగొడుతోందని ఆయన ఆరోపించారు. ఇదే పని జా ర్ఖండ్‌లో కూడా చేయడానికి ప్రయత్నించారని, కా ని తాము అడ్డుకున్నామని ఖర్గే తెలిపారు. గత పడేళ్లుగా బిజెపియేతర ప్రభుత్వాల పట్ల మోడీ ప్రభుత్వ వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. భారతదేశం ఎన్నికల నియంతృత్వంగా మారిపోయిందని, అంతేగాకుండా మోడీ పాలనలో ఫెడరలిజం బలహీన పడిందని ఆరోపించింది.
నల్ల పత్రం ఒక దిష్టి చుక్క : మోడీ
కాంగ్రెస్ తమ ప్రభుత్వంపై విడుదల చేసిన నల్ల పత్రాన్ని దిష్టి చుక్కగా ప్రధాని మోడీ అభివర్ణించారు. తన ప్రభుత్వం సాధించిన విజయాలపై చెడు కన్ను పడకుండా దిష్టి చుక్కలా ఇది పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. తమ కోసం ఈ మంచి పని చేసినందుకు ఖర్గేకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.