Saturday, November 9, 2024

కొవిడ్ రోగులపై బ్లాక్ టైగర్ దాడి

- Advertisement -
- Advertisement -

Black fungal infections in people who have recovered with Covid

విజృంభిస్తోన్న ఫంగస్ వ్యాధి
మనుష్యుల శ్వాసకు ముప్పు
కంటిచూపు క్షీణత.. ప్రాణాంతకం
కోలుకున్న రోగులలో లక్షణాలు
ముందుగా గమినిస్తేనే చికిత్స సాధ్యం

న్యూఢిల్లీ : మహమ్మారికి తోడు తోడేలు దండు ఎక్కువ అని కరోనా వైరస్ రుజువుచేస్తోంది. కొవిడ్ సంభవించి చికిత్సతో కోలుకున్న వారిని ఇప్పుడు బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రాణాలు తోడేసేలా మారింది. ఇటీవలి కాలంలో ఉత్తరభారతంలో ప్రత్యేకించి ఢిల్లీ ఇతర చోట్ల బ్లాక్ ఫంగస్ పంజా విసిరింది. ఈ విషయాన్ని కొవిడ్ నుంచి కోలుకుని తిరిగి అనారోగ్యం పాలయిన వారి రక్తకణాల నుంచి సేకరించిన నమూనాలతో కనుగొన్నారు. ఢిల్లీ, పుణే, అహ్మదాబాద్ ఆసుపత్రులలో డాక్టర్లు తమ వద్దకు వచ్చే రోగుల శరీరంలో ఈ బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు గుర్తించారు. దీనిని పుణేలోని వైరాలజీ సంస్థ కూడా నిర్థారించింది. దీనితో కరోనా సంబంధిత కలికాల ప్రభావంతో అనుబంధ జబ్బులు ఆరంభం అవుతున్నట్లు స్పష్టం అయింది. నిజానికి మ్యుకోర్మిసిసిస్ అనే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కొవిడ్ 19 వైరస్‌తోనే పుట్టుకొస్తుంది. కొందరు రోగులు కరోనా నుంచి కోలుకున్నా వారి శరీరంలో ఈ ఫంగస్ అవశేషాలు మిగిలి ఉంటాయి. ఈ క్రమంలో వారిలో జరిగే పరిణామాలతో వారు దీని ద్వారా పెను ముప్పు తెచ్చుకుంటారు.

కరోనా దశల్లో మరణాల విషయాలను పరిశీలిస్తే అత్యధికం ఈ ఫంగస్ సోకి ఉన్న వారికే ముప్పు ఉందని నిర్థారణ అయింది. దీనికి సంబంధించి సర్‌గంగారామ్ హాస్పిటల్ ఇఎన్‌టి సీనియర్ సర్జన్ డాక్టర్ మనీష్ ముంజల్ వివరించారు. ఇటీవలి కాలంలో ఈ ఫంగస్ అనేక మందిలో గుర్తించినట్లు తెలిపారు. పలు చోట్ల వెలుగులోకి రాకుండా అనేకులలో ఈ ఫంగస్ లక్షణాలు ఉండొచ్చు. అయితే రెండు రోజుల వ్యవధిలోనే తమ ఆసుపత్రిలో ఆరుగురు వ్యక్తులు ఈ మ్యుకోర్మిసిసిస్ జబ్బుతో చేరారని డాక్టర్ మనీష్ తెలిపారు. గత ఏడాది ఈ ప్రాణాంతక జబ్బు పలు సమస్యలు తెచ్చిపెట్టిందని అత్యధిక మరణాలకు దారితీసిందని, పలువురె రోగులకు ఈ ఫంగస్‌తో కంటిచూపు పోయిందని, పలువురికి వెంటనే ముక్కు, కీళ్లను కూడా తొలిగించాల్సి వచ్చిందన్నారు.

స్టెరాయిడ్స్‌తో ఫంగస్ ఏర్పడుతుంది

కొవిడ్ చికిత్స దశలో అత్యధిక స్థాయిలో తీవ్రస్థాయి స్టెరాయిడ్స్‌ను వాడటం కూడా ఈ ఫంగస్ ఏర్పాటుకు కారణం అవుతుందని గంగారామ్ ఆసుపత్రిలో ఇఎన్‌టి విభాగ డైరెక్టర్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. ఇతర కారణాలు కూడా ఉంటాయని, ప్రత్యేకించి రోగులలో డయాబెటిస్ ఉండటం కూడా ఈ పరిణామానికి దారితీస్తుందన్నారు. ఇటీవలి కాలంలో తిరిగి బ్లాక్ ఫంగస్ తలెత్తిన విషయాన్ని ఆయన నిర్థారించారు. నిజానికి కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిన వారిలోఇది ఎక్కువగా వస్తుంది, కిడ్నీ, గుండెజబ్బులు ఉన్న వారికి ఇది ప్రాణాంతకం అవుతుందన్నారు. బ్లాక్ ఫంగస్ వాతావరణంలో సహజంగానే ఉంటుంది. ఇది శరీరంలోకి సోకితే ముప్పు ఏర్పడుతుంది. ఇమ్యూనిటీ సరిగ్గా లేని వారు ఏ విధంగా అయినా దీని బారినపడితే కొవిడ్ కన్నా ఎక్కువ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటారని నిపుణులు తెలిపారు. ఈ ఫంగస్ గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులలోకి చేరుతుంది. ఐసియూలో చికిత్స పొందే వారికి కూడా సోకుతుంది. ప్రత్యేకించి సైనస్ వద్ద ఈ ఫంగస్ కణజాలం గుమికూడటం వల్ల తలెత్తే పరిణామం బాధాకరం అవుతుంది. కొన్ని సందర్భాలలో శరీర గాయాల నుంచి కూడా లోపలికి చేరుతుంది.

సగం మంది ప్రాణాలు గాలిలో

ఇప్పటివరకూ ఈ ఫంగస్ ప్రభావం గురించి పలు అధ్యయనాలు జరిగాయి. దీని బారిన పడిన వారిలో సగం మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రత్యేకించి ఈ ఫంగస్ సోకితే చాలా మందికి కంటిచూపుపోవడం, ముఖం వాపు , ముక్కు ఓ వైపు మూసుకుపోయినట్లు అన్పించడం వంటి పరిణామాలు ఉంటాయి. అవయవాలలో నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశాలు తక్కువ అని ఇఎన్‌టి సర్జన్లు తెలిపారు. అయితే లంగ్స్‌కు చేరితే ఇక ఇది ప్రాణాలు తీసే వరకూ వదలదని, విపరీతమైన దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి పరిణామాలు ప్రాణాంతకం అవుతాయని వివరించారు.

ముక్కు మూసుకుపోతే వెంటనే సంప్రదించాలె

అన్నింటి కంటే ముందు మన ముక్కులో ఎటువంటి ఇబ్బంది ఏర్పడ్డా అది ఫంగస్ వైరస్ లక్షణం అని గుర్తుంచుకోవాలని డాక్టర్లు తెలియచేస్తున్నారు. కళ్లు ఉబ్బడం, దవడలు బిగుసుకుపోవడం, శరీరంపై నల్లటి మచ్చలు ఏర్పడటం బ్లాక్ ఫంగస్ కీలక ఆనవాళ్లు . వీటిలో ఎటువంటి పరిణామం తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంది. సత్వర వైద్య పరీక్షతో బయోప్సీతో , సంబంధిత యాంటీఫంగల్ థెరపీతో ఇది విస్తరించకుండా ఉంటుందని తెలిపారు. సమస్య తీవ్రత ఉన్నవారికి యాఫోటెరిసన్ బి వంటి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లను ఇస్తున్నారు. భారత్ సీరం అండ్ వ్యాక్సిన్స్ రూపొందించిన ఎల్‌ఎఎంబి ఔషధాన్ని కూడా వాడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News