Friday, November 22, 2024

గడ్డం పెంచితే విశ్వకవులవుతారా?

- Advertisement -
- Advertisement -

Black money did not come back with cancellation of notes

 

విశ్వకవి రవీంద్రుడికి పొడుగు గడ్డం ఉండేది. మార్క్‌కు గుబు రు గడ్డం ఉండేది. డార్విన్‌కు ఉండేది, మన పెరియార్‌కూ ఉండేది. ఇంకా కొంత మంది వైజ్ఞానికులకూ ఉండేది. నిరంతరం మానవాళి శ్రేయస్సు కోసం తపించే ప్రపంచ మేధావులకు గడ్డాలు, మీసాలు కత్తిరించుకుంటూ కూర్చునే తీరిక ఉండక పోయేదేమో! ఏ పనీ చేతకాని బద్దక సోంబేరులు కూడా గడ్డా లు పెంచుతారు. వారిని సన్యాసులంటారు. పాత కాలంలో వీరినే రుషులనేవారు. వీరి చుట్టూ ఉన్న అనైతిక కార్యక్రమాలు, అక్రమ సంబంధాలు పురాణాల నిండా విరాజిల్లుతూనే ఉన్నాయి. ఇప్పుడిక్కడ పొడుగు గడ్డం పెంచడం పెంచక పోవడం కాదు. ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారా లేదా? అనేది ముఖ్యం. ప్రజలకు అర్థవంతమైన సందేశం ఇవ్వగలుగుతున్నారా లేదా అనేది ముఖ్యం. ఈ దేశం లో ఓ మహా నాయకుడు గడ్డం పొడుగ్గా పెంచి, తన క్రియా శూన్యత్వాన్ని ప్రదర్శిస్తూ సన్యాసిగా కనిపిస్తున్నారు. 5 ఆగస్టు 2020కి 15 ఆగస్టు 1947కి తేడా తెలుసుకోకుండా ‘భాషణ్’ లిస్తుంటారు. సుదీర్ఘంగా సాగిన స్వాతంత్య్రోద్యమం విజయవంతమై, దేశానికి 15 ఆగస్టున స్వాతంత్య్రం లభించింది. అయితే.. దాన్ని రామజన్మ భూమి భూమి పూజ జరిగిన 5 ఆగస్టుతో పోల్చి గొప్పగా మాట్లాడడం, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంలో మునిగిన అతి తెలివికి నిదర్శనం.

రామజన్మ భూమి ఒక వర్గానికి, ఒక మతానికి సంబంధించింది. అదీ బాబ్రీ మసీదు కూల్చడానికి చేసిన సంఘర్షణ! రథయాత్ర, కర సేవ వగైరాలన్నీ దాని కోసం చేసినవే ఎన్ని చేసినా, దాన్ని దేశ స్వాతంత్య్ర పోరాటంతో పోల్చడం అవివేకం. స్వాతంత్య్ర పోరాటం దేశంలోని అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజల పోరాటం. ఆత్మ గౌరవానికి, ఆత్మ నిర్భరతకు చిహ్నం. అంతటి మహోన్నత పోరాటాన్ని ఒక చిన్న ఆలయ ప్రారంభోత్సవంతో పోల్చడం విజ్ఞత అనిపించుకుంటుందా? ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవారికైనా తేడా తెలిసిపోతుంది. దేశంలో అత్యంత ముఖ్య స్థానంలో ఉన్న వ్యక్తి, స్వాతంత్య్ర దినోత్సవానికి ఉన్న విలువను తగ్గించి మాట్లాడవచ్చా? పైగా, అసలే వారు దేశ భక్తుల కోవకు చెందిన వారు కదా? ఇటలీ మార్కిస్టు రచయిత, భాషా శాస్త్రవేత్త, జర్నలిస్టు, రాజకీయ నాయకుడు అయిన ఆంటానియో ఫాన్సిస్కో గ్రాంసి జీవితంలోని అన్ని పార్శాల్ని అవలోకించిన తత్తవేత్త కూడా? మరి అలాంటి వారి మాటల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కదా?

విస్తారమైన ఆయన అనుభవ సారాన్ని ఆయన ఇలా అందించారు “జీవించి ఉన్నా మంటే ఏదో ఒక పక్షం వహించాలి. నిజంగా జీవించి ఉన్న వారు పౌరులుగాను, పక్షపాతులుగాను ఉంటారు. తటస్థత, ఉదాసీనత, పరాన్న జీవనం, గతి తప్పడం జీవితం కాదు! అది పలాయన వాదం!! అందుకే నాకు తటస్థం అంటే అసహ్యం!” నిజాయితీగా మనం ఇక్కడ కొన్ని విషయాల గూర్చి ఆలోచిద్దాం! … చండీయాగం చేస్తే రాజ్యాధికారం వస్తుందా? సుందర కాండ పారాయణం చేస్తే కష్టాలు పోతాయా? నరబలి ఇస్తే లంకెల బిందెలు ఖాయమా? తాయత్తులు కట్టించుకుని సమాధుల చుట్టు తిరిగితే పుణ్యమా? అసలు పుణ్యమంటే ఏమిటి? అది ఎ ందుకు ఎవరికి ఎప్పుడు పని కొస్తుంది? సరస్వతి చదువుల తల్లా? వినాయకుడు చదువు ప్రసాదిస్తాడా? గాయత్రీ మంత్రం జపిస్తే జయం తథ్యమా? తీర్థ యాత్రలు చేస్తే సంతానం కలుగుతుందా? పవిత్రమైన నదుల మురికి నీళ్లలో మునిగితే ఆత్మలు శుభ్రపడతాయా? కల్వరి కొబ్బరి నూనె రాసుకుంటె జబ్బులు తగ్గుతాయా?

రైస్ పుల్లింగ్ బొమ్మ కొంటే.. ఇక పట్టిందల్లా బంగారమవుతుందా? ఇవన్నీ చేసేది అమాయకులు, అజ్ఞానులు కాదు. ఈ దేశంలోని విద్యావంతులు, ఉన్నత స్థాయిలో ఉన్నవారే ఇవన్నీ నమ్ముతున్నారు. పైగా ఇదే మా సంస్కృతి మా సంప్రదాయం అని రొమ్ము విరుచుకుంటున్నారు. ఆ మధ్య వెలుగులోకి వచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దేవుని ప్రతిమలు కలిగిన బిందెలకు, ఇతర పాత్రలకు ఎంతో శక్తి ఉంటుందని అవి బియ్యాన్ని ఆకర్షిస్తాయని (రైస్ పుల్లింగ్)… వాటిని ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందనీ నమ్మి మోసపోయిన డాక్టర్ రామకృష్ణ రాజు అమలాపురంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది కదా? పురాతన కాలంలోనే కాదు, ఆధునిక కాలంలోనూ ఎన్నో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు మహారాష్ట్రలో ఓ ముస్లింకు కాషాయం కప్పి, మహిమలు అంటగట్టి దేవుణ్ణి చేశారు.

కాషాయం కప్పిన వారే భజన్లు చేసి కీర్తనలు పాడుతున్నారు. మంత్రాలు చదివి సేవలు చేస్తున్నారు. మరి ఆయన ఫోటో ఏ ఒక్క ముస్లిం ఇంట్లో కూడా ఉండదు. ఒకప్పుడు బుద్ధుణ్ణి స్వంతం చేసుకున్న వారు, ఇటీవల ఒక ముస్లింను స్వంతం చేసుకున్నారని అర్థం అవుతూనే ఉంది. రేప్పొద్దున ఎవరైనా జీసస్‌కో లేక ఇతర మతాల దేవుళ్లకో కాషాయం కప్పితే ఈ పూజార్లు అక్కడా ప్రత్యక్షమై మంత్రాలు చదువుతూ, పూజలు చేస్తూ భజన్లు చేస్తూ ఊగిపోతారేమో? కొందరు పరిశోధకులు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్లూ కలిసి ఒక పరిశోధన పత్రం రాశారు. అందులో భగవద్గీత శ్లోకాలు చదవడం వల్ల ప్రశాంతత ఏర్పడుతుందని, దాని వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులకు చాలా మేలు జరుగుతుందనీ ప్రకటించారు. వారు ఆ వృత్తి మానేసి వారికి అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీలో చేరడం మంచిది. బుద్ధీ, జ్ఞానం ఉన్న సామాన్య జనం మాత్రం ఎవరూ వారిని నమ్మరు.

రీసర్చ్ పేరుతో, పరిశోధనా ఫలితాల పేరుతో మనువాదులు ఇలాగే సిగ్గు వదిలి చెలరేగిపోతున్నారు. జనం అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. రేపొద్దున వీరే ఈ పేషెంట్‌కు పుత్రకామేష్టి యాగం చేయించండి. ఆమె కోసం మహా రుద్రాభిషేకం 108 సార్లు స్నానం చేయించండి సరిపోతుంది. ఇక ఈమె కేమో చండీయాగం అవసరం. అదిగో అక్కడి ఆ పేషంట్ కోసం సర్పయాగం అంటూ ప్రిస్క్రిప్షన్లు రాస్తారేమో ఎవరికి తెలుసూ? మన పూర్వీకుల అజ్ఞానాన్ని వారసత్వంగా స్వీకరించి సంస్కృతి సంప్రదాయాల పేరుతో కొనసాగించడం మత విశ్వాసకుల ఆచారం. లీగల్ సెక్రటరీగా పని చేసిన మహిళ అలైస్ మెక్కిన్నే ఒక చోట చెపుతారు “మతం మూడు పనులు బాగా చేయగలదు. 1. మనుషుల్ని విడదీయ గలదు. 2. తన ఆధీనంలో ఉంచుకోగలదు. 3. జనాన్ని భ్రమల్లో ఉంచగలదు” అని! ఒకప్పటి వైదిక ధర్మం, సనాతన ధర్మం, బ్రాహ్మణిజంలకు పెట్టుకున్న కొత్త పేరే హిందుత్వం. దాన్ని బ్రాహ్మణులతో సహా అన్ని కులాల వారూ పెంచి పోషించారు. ఇంకా పోషిస్తున్నారు కూడా? అంబేడ్కర్ వల్ల విద్యని, పదవుల్ని, ఆస్తుల్ని పొంది… మనువాదుల ప్రభావంలో పడి, వారి చంకల్లో దూరిన బహు జనుల్ని ఏమందాం? మనువాదులెంత ప్రమాదకరమైన వాళ్లో, ఎంత హీనమైన వాళ్లో వీళ్లూ అంతే నన్న మాట! అట్లని మనం ఎవరినీ వదిలేయకూడదు. వాస్తవాల్ని నిరంతరం చెపుతూనే ఉండాలి. మానసిక పరివర్తన కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి.

పసి పిల్లలు తమ కోరికలు ఏడుపు ద్వారా వెల్లడిస్తే, పెద్ద వాళ్లు ప్రార్థన రూపంలో వెల్లడిస్తారు. అంటే ఏమిటి? ప్రార్థన ఒక ఏడుపు లాంటిది. దానితో మనసు కొందరికి కుదుటపడుతుందేమో గాని, దాని వల్ల ఏమీ కాదు. అది ఎవరికి వారు వారి సంతృప్తి కోసం చేసుకునేదే తప్ప, దాని వల్ల చేసిన వారికి గాని, వారి పక్క వారికి గాని, సమాజానికి గాని ఎక్కడా ఏమీ ప్రయోజనం ఉండదు. ‘రోజుకు ఐదు సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే, కరోనా దరికి రాదు’ అని బిజెపి ఎంపి ప్రజ్ఞాసింగ్ టాగూర్ ప్రబోధించారు. అదే నిజమైతే ఆసుపత్రులూ, డాక్టర్లూ, చికిత్సలాంటి వన్నీ ఎ ందుకూ? దేశ హోం మంత్రికి కరోనా సోకినప్పుడు వారు ఆ హనుమాన్ చాలీసానే పఠిస్తే బావుండేది కదా? మరి ఎందుకు ఒకటికి రెండు సార్లు ఆయన ఆసుపత్రుల్లో చేరారూ? అజ్ఞానం సిగ్గుపడాల్సిన పని కాదు. అజ్ఞానంతో ఉండాలని ఆజ్ఞాపించడం, బోధించడం, ప్రకటించడం… సిగ్గుపడాల్సిన విషయం”. “తెలివిలేని వారి గురించి మనం కోపగించుకోగూడదు.

కాని, తెలివి తక్కువ తనాన్ని జ్ఞానంగా భ్రమింపజేస్తూ ప్రబోధించే వారిని ఉపేక్షించ గూడదు. క్షమించగూడదు. వారు తక్షణం శిక్షించదగిన వారు” అని అన్నారు డేనియల్ డెన్నెట్. అమెరికన్ మేధో పరిశోధకుడు, రచయిత. సరే, ఇప్పుడు అందరికందరూ ప్యాంట్లూ, షర్టులు వేసుకుంటున్నారు. కొందరు ఆడ పిల్లలతో సహా అది అన్యమతస్థుల వేషధారణ కదా? దేశ ప్రజల్లో అత్యధికులు అలా అన్యమస్థుల వేషధారణలో తిరుగుతూ ఉంటే ఈ సంప్రదాయ దేశభక్తుల మనోభావాలు దెబ్బ తినడం లేదా? దేశంలోని బాలబాలికలంతా ఇతర దేశపు భాషలో విద్యనార్జిస్తుంటే వీరు అడ్డుకోలేక పోతున్నారే. అధిక ధనార్జన కోసం విద్యావంతులంతా విదేశాలకు వలస పోతుంటే సంప్రదాయ చాదస్తులేం చేస్తున్నారూ? దేశం నిండా వేద పాఠశాలలు తెరిచి, సంస్కృతం నేర్పించి ఎవడూ సైన్సు పేరెత్తకుండా చేయగలరా? ఆధునిక విజ్ఞానం మీద, డిజిటల్ టెక్నాలజీ మీద ఎక్కువగా ఆధారపడుతున్నది దేశభక్తుల పార్టీయే కదా? అంటే ఏమిటి? తాము గొప్పదని శ్లాఘించే సనాతన జ్ఞానానికి, ధర్మానికి ద్రోహం చేస్తున్నట్లే కదా? మరొక విషయం జాగ్రత్తగా గమనించండి.

వినాయక నిమజ్జనం రోజున గణేశ్ లడ్డూ వేలం వేస్తుంటారు కదా? ఆ లడ్డూని ఏ సంప్రదాయ వాదైనా ముందుకు వచ్చి కొంటున్నాడా? దానికి ఏ మహిమలూ ఉండవని అతగాడికి తెలుసు. ఇతర కులస్థుల్ని బోల్తా కొట్టించి వారితో కొనిపించడం వారి ఉద్దేశం. వెర్రి వెంగళప్పలైన బహు జనులు పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుని, ఏదో పెద్ద దైవ కార్యం చేశామని సంబరపడి పోతుంటారు! “మతం అధికారంలోకి రావాలనుకుంటే… ఆచార సంప్రదాయాలను, విద్యలోను, చట్టాల్లోనూ తద్వారా నిత్య జీవితంలోనూ జొప్పించాలని చూస్తుంది.” అని అన్నారు బ్రిటిష్ సైన్స్ రచయిత సర్ ఆర్ధర్ సి. క్లార్క్. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణ గురించి ఆధ్యాత్మిక వేత్తలు, వారికి వంతపాడే దేశ నాయకులు ఏం చేశారు? మరి ఎందుకు కట్టడి చేయలేకపోయారు? దేశంలోని స్వాములు, బాబాలు, పాస్టర్లు, ముల్లాల నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్‌లలో ఏ ఒక్కటీ కరోనా ఉధృతిని తగ్గించలేక పోయిందన్నది గమనించాలి. ప్రధాని ప్రకటించిన లాక్‌డౌన్‌లతో కరోనా పోలేదు.

నోట్ల రద్దుతో నల్లధనం వెనక్కి రాలేదు. బిజెపి గెలిచింది కానీ, ప్రతి పౌరుడి బ్యాంక్ ఎకౌంట్‌లో రూ. పది హేను లక్షలు రాలేదు. బ్యాంకు దోపిడీదార్లను వెనక్కి రప్పించింది లేదు. వారి నుండి డబ్బు కక్కించిందీ లేదు. జిఎస్‌టితో ఆర్థిక వ్యవస్థ మెరుగు పడలేదు. యువతకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు రాలేదు. ఇవన్నీ ప్రత్యక్షంగా కళ్లకు కనబడుతున్నప్పుడు ఇక ఇప్పుడు, ఈ వ్యవసాయ బిల్లుతో రైతుకు మద్దతు ధర ఎలా లభిస్తుందీ? దేశ నాయకులు గడ్డాలు పెంచుతున్నారా? కత్తిరించుకుంటున్నారా అన్నది ప్రజలకు అనవసరం! ఈ సావర్కర్ వారసులు… రవీంద్రులో, మార్కో, పెరియార్లో అవుతారని… ఏ మాత్రం ఊహించుకోలేరు. దేశాన్ని విపణి వీధిలో పెట్టి, ప్రజల్ని సన్యాసులుగా మార్చాలన్న వీరి దురాలోచన మాత్రం సఫలం కాదు. మతం, దేవుడూ అనే రెండు ఊత కర్రల్ని చంకల్లో దోపుకుని నడిచే ప్రభుత్వాల్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఏం చేయాలో వారికి తెలుసు!!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News