న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం జరిగిన పేలుడుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సిసిటీవి కెమెరా దృశ్యాల ఆధారంగా ఇప్పటికే ఇద్దరు అనుమానితులను గుర్తించారు. అయితే వారు అసలైన అనుమానితులా కాదా అన్న అనుమానాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నిందితులను పట్టుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇజ్రాయెల్ రాయబారిని దుర్భాషలాడుతూ రాసిన ఒక పేజీ లేఖను గుర్తించారు. లేఖపై వేలిముద్రలను తెలుసుకోడానికి ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆలేఖ “సర్ అల్లా రెసిస్టెన్స్”పేరు కలిగిన సంస్థదని అనుమానిస్తున్నారు. ఆ లేఖలో జియోనిస్టులు, పాలస్తీనా, గాజా వంటి పదాలను ప్రస్తావించినట్టు పోలీస్ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. . నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి), ఫోరెన్సిక్ నిపుణులు బుధవారం ఆ ప్రదేశాన్ని సందర్శించారు.
పేలుడు పదార్థాల అవశేషాలు ఏవీ లభించక పోయినప్పటికీ, పేలుడు రసాయనాల అవశేషాలు ఏమైనా దొరుకుతాయని ఆ ప్రదేశం లోని ఆకులు, గడ్డి సేకరించారు. ఎన్‌ఎస్‌జి బృందం అక్కడ రెండు జాగిలాలను కూడా విడిచిపెట్టింది. అబ్దుల్ కలాం రోడ్, పృధ్వీరాజ్ రోడ్ సిసిటివి ఫుటేజీలను కూడా సేకరించారు. రాయబార కార్యాలయం ఉన్న చాణక్యపురి ఆవరణలో భద్రతపై పోలీస్‌లు సమీక్ష జరిపారు. అలాగే ఆ రాయబార కార్యాలయాల వద్ద భద్రతాధికారుల నిఘా ఉంచారు. భారత్ లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సమీపంలో గతం లోనూ రెండుసార్లు దాడులు జరిగాయి. 2012లో ఎంబసీ లోని ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది భార్య కారుపై బాంబు దాడి జరిగింది. ఈ సంఘటనలో ఆమె గాయపడ్డారు. 2021లో ఎంబసీ వెలుపల పేలుడు సంభవించినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి.