Wednesday, January 22, 2025

రౌతేదో.. రత్నమేదో గుర్తించి.. ఆశీర్వదించండి!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట/హుస్నాబాద్: మనది పేదల ఎజెండా, రైతుల ఎజెం డా అని సిఎం కెసిఆర్ అన్నారు. రౌతేందో రత్నమేందో ఆలోచించాలని ప్రజలకు సభలో సూచించారు. ‘2018 లో శాసనసభ ఎన్నికల మొదటి సభ లో నేను ఇక్కడికే వచ్చి ప్రసంగించడం జరిగింది. హుస్నాబాద్ గడ్డ ప్రజల ఆశీర్వాదంతో ఆనాడు మూడొంతు ల మెజారిటీతో 88 సీట్లతో అఖండ విజయాన్ని సాధించినం. ఈసారి కూడా పెద్దలందరూ చెప్పినారు. మళ్లీ మీరు హుస్నాబాద్ నుంచి జైత్రయాత్ర ప్రా రంభించాలనే అన్నారు. అభ్యర్థులందరికీ బీఫారాలు అందజేసి మన మేనిఫెస్టో ప్రకటించి నేను ఇక్కడికి మీ దర్శనానికి రావడం జరిగింది. నేను మీ అందరినీ ఒక్కటే మాట కొరుతున్నా.. నేను చెప్పే నాలుగు మాటలు వినాలి. నేను చెప్పె మాటలు విని విడిచిపెట్టి పోవద్దు. మీ బస్తీకో, మీ గ్రామానికో, తండాకో పోయిన తర్వాత కెసిఆర్ నాలుగు మాటలు చెప్పిండు అందులో నిజమేంది అని ఆలోచించాలే.

ఎన్నికలు చాలా వస్తయి.. ఎవరో ఒకరు గెలుస్తా ఉంటరు. ఎలక్షను రాంగనే మనం ఆగమాగం కావద్దు. రౌతేందో రత్నమేందో ఆలోచించాలే. మనకు పనికిచ్చేదేదో గుర్తుపట్టాలే. ఎవరో చెప్పిండ్రని అలవోకగా ఓటువేయవద్దు. ఓటు అనేది మన తలరాతను మార్చుతది, తాలూకా రాతను మార్చుతది, జిల్లా రాతను మార్చుతది. మన భవిష్యత్తును మార్చుతది.చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన బావమరిది చెప్పిండో చుట్టం చెప్పిండో, మన మేనమామ చెప్పిండో అనే పద్ధతిలో ఓట్లు వేయకూడదు. కచ్చితంగా ఆలోచించి స్పష్టమైన విధానంతోటి, స్పష్టమైన అవగాహనతోని ఓటింగ్ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గెలుస్తారు. ప్రజల కోరికలు నెరవేరుతయి’ అని సిఎం కెసిఆర్ ప్రజలకు సూచించారు.

ప్రస్తుతం జరగనున్న ఎన్నికలలో 105 సీట్ల గెలుపునకు హుస్నాబాద్ నాంది కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించి మాట్లాడారు.2018లో మొదటి శాసన సభ ను హుస్నాబాద్ గడ్డ నుంచే ప్రారంభించడంతో 88 సీట్లతో అఖండ మెజార్టీ సాధించామన్నారు. ఈ ఎన్నికలలో సైతం జైత్ర యాత్ర హుస్నాబాద్ నుంచే ప్రారంభించుకోవడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. బిఆర్‌ఎస్ 9 ఏండ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందించాన్నరు. అలాగే వ్యవసాయానికి అర్థం, స్ధిరత్వం వచ్చిందన్నారు. ఎవ్వరూ అడగకుముందే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేశామన్నారు. ఒకప్పుడు రైతులకు అప్పు ఇచ్చి ఇంటి దర్వాజలు సైతం గుంజుకొని పోయేవారని కానీ ఆ పరిస్థితి మారి తమ పాలనలో రైతులకు కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, పొలాలు, ఇళ్లలో కరెంట్, కల్లాల నిండా వడ్లు రావడంతో వారిలో ఆనందం వచ్చిందన్నారు.

కాంగ్రెస్ 50 ఎండ్ల పాలనలో ట్రాన్స్‌ఫార్మార్లు, మోటార్లు కాలనిది పంట చేతికి వచ్చేది కాదన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్‌కు వెళితే సుమారు 5 రోజులు పట్టేదని అలాగే 800 ఫీట్లు బోర్లు వేసిన చుక్క నీరు పడేది కాదన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో నిరంతరం నాణ్యమైన విద్యుత్, గోదావ రి జలాలు అందించడంతో మోటార్ రిపేర్ దుకాణాలు మూ సుకపోయి ఎటు చూసినా పచ్చని పంట పొలాలే దర్శనం ఇస్తున్నాయన్నారు. 9 ఏండ్ల కిందట తెలంగాణలో కరువు కాటకాలు, వలసలే ఉండేవని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక బిఆర్‌ఎస్ పాలనలో తలసరి ఆదాయం, తలసరి విద్యుత్, మంచి నీరు వినియోగం పల్లెల్లో చెట్లతో, పారిశుధ్య రంగాలతో పాటు అనేక రంగాలలో మొదటి స్ధానంలో నిలిచామన్నారు.

ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మిషన్ భగిరథ ద్వారా ఇంటింటికి నల్లాలు పెట్టి మంచినీరు అందిస్తుంది ఏకైక తెలంగాణ రాష్ట్రమన్నారు. ఓటు అనేది మన రాష్ట్ర భవిష్యత్తునే మార్చేస్తుందన్నారు. ఎవ్వరో చెబితే ఓటు వేయకుండా, సొంత ఆలోచనతో ఓటు వేయాలన్నారు. ఎలక్షన్‌లు వచ్చినప్పుడు ఆగమాగం కాకుండా ప్రజలు ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న జఠిలమైన సమస్యల పరిష్కారం కోసం మేథోమథనం చేసి ఆర్ధిక నిపుణుల సలహాలు, సూచనలు పాటించి తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పర్చుకున్నామన్నారు.

కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులు సైతం యుద్ధ్ద ప్రతిపాదికన ఆరు నెలల్లో పూర్తి చేసి లక్షా 10 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పక్షాల వారు ప్రాజెక్టులు కట్టకుండా కేసులు పెట్టి ప్రాజెక్టుల నిర్మాణాలు అడ్డుకుంటున్నారన్నారు. అయినా అతి తక్కువ కాలంలో ప్రాజెక్టులు కట్టి చూ పించామన్నారు. పారిశ్రామిక పెట్టుబడులు సాధించి 25లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. స్వాతంత్యం వ చ్చినప్పటి నుంచి దళితుల గురించి ఎవ్వరు ఆలోచించలేదని ఇంకా పేదరికమే వారిలో కమ్ముకుందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే దళితుల అభ్యున్నతి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ ఎ న్నికలలో ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్న పార్టీ నాయకులను 10 నుంచి 12 సార్లు చాన్స్ ఇచ్చిన రాష్ట్ర ప్రజానికం కోసం ఏమి చేయలేక పోయారన్నారు. రకరకాల ఇబ్బందులతో బాధపడే వారికి ఆసరా ఫించన్లు మరింత బాసటగా నిలిచాయన్నారు.

ఎన్నికల సమయంలో ఆపద మొక్కులు మొక్కే వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒకప్పుడు హుస్నాబాద్ కు వస్తే ఈ ప్రాంతమంతా కరువు, కాటకాలకు నిలయంగా ఉండేదన్నారు. ప్రస్తుతం ఎటూ చూసినా పచ్చని పంట పొలాలే కనబడుతున్నాయన్నారు. పెంచుతున్న పింఛన్‌ను నెలకు రూ. 500 చొప్పున ఐదు సంవత్సరాలలో ఐదు వేల వరకు అందిస్తామన్నారు. ఓట్ల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసమే బిఆర్‌ఎస్ పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కావడంతోనే భూగర్భ జలాలుపైకి వచ్చాయన్నారు. ధాన్యం కొనుగోలు కోసం రెండు నెలలు లారీలు పెట్టిన ఇంకా ధాన్యం వస్తూనే ఉందన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగడంతో పాటు ఆనందంగా జీవిస్తున్నారన్నారు. శనిగరం ప్రాజెక్టు ప్రదాన కాల్వ లీకేజీని మరమ్మత్తు లు చేయడంతో పాటు కొత్త కొండ జాతర వీరభద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధ్ది చేస్తామన్నారు. ఎల్కతుర్తి, సిద్దిపేట వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. అలాగే ముల్కనూరులో బస్టాండ్, జూనియర్ కళాశాలను నిర్మిస్తామన్నారు. ప్రజల కోరిక మేరకు దశల వారిగా అభివృద్ది పనులను పూర్తి చేస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలన్న ఎజెండాతో ముందుకు సాగుతున్నామన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్ధి వొడితల సతీష్ కుమార్ నిరంతరం ప్రజా సేవలోనే ఉంటారన్నారు. ఈ ఆశీర్వాద సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే 60 వేల మెజార్టీ రావడం ఖాయంగా కనబడుతుందన్నారు.

హైదరాబాద్‌లో 55 మందికి భీ ఫామ్‌లు అందించామని సభా సాక్షిగా హుస్నాబాద్‌లో సతీష్‌కు భీఫామ్ ను అందిస్తున్నానన్నారు. సతీష్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్ర ఆర్ధిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు , ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ , ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు బోయిని పల్లి వినోద్‌కుమార్ మాట్లాడారు. సభలో రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎంపీ కాప్టెన్ లక్ష్మికాంతరావు, జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, సుదీర్‌కుమార్, బాలకిషన్‌రావు, నాగిరెడ్డి, తదితరులు ఉన్నారు.

కెసిఆర్ మాట ఇస్తే తప్పడన్న నమ్మకం ప్రజల్లో ఉంది : హరీశ్‌రావు
కేసీఆర్ మాట ఇస్తే తప్పడన్న నమ్మకం ప్రజల్లో ఉందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నా రు. ఆదివారం హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి నల్లాల ద్వారా స్వచ్చమైన నీటిని అందించి నీటి గోస లేకుండా చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతో ఎటు చూసినా పచ్చని పంట పొలాలే దర్శనమిస్తున్నాయన్నారు.

కెసిఆర్ మేనిఫెస్టోను చూసి ప్రజల హృదయాలలో ఆనందం కలుగుతుంటే ప్రతి పక్షాల గుండెల్లో వణుకు పుట్టుకొచ్చిందన్నారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్‌కు ఎంతో ప్రేమ ,నమ్మకం అన్నారు. గత ఎన్నికలలో సైతం కెసిఆర్ హుస్నాబాద్‌లోనే శంఖారావాన్ని పూరించి 88 సీట్లు సాధించారని అలాగే ఈ సంవత్సరం సైతం ఇక్కడే ప్రచారాన్ని మొదలు పెట్టారన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ దయతో ఈ ఎన్నికలలో బిఆర్‌ఎస్ అభ్యర్ధుల గెలుపు సెంచరీ దాటుతుందన్నారు. ఢిల్ల్లీ వెళ్లి తెలంగాణ తీసుకువస్తానన్నా కెసిఆర్ పట్టు వీడకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. గతంలో నినాదాలు గోడ మీద రాతలు ఉండేవని వాటిని నేడు నిజం చేసి చూపించామన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ నిరంతరం ప్రజా సేవ కోసమే పని చేస్తారన్నారు. కేసీఆర్ ఆశీస్సులు సతీష్ కుమార్ పట్టుదలతో హుస్నాబాద్ అన్ని రంగాలలో వేగంగా అభివృద్ది చెందిందన్నారు. గత ప్రభుత్వాలు తండాలను జీపీలుగా మా రుస్తామని మాటలు చేప్పారే తప్పా ఏ రోజు తండాల గురించి పట్టించుకోలేదన్నారు. అదే సిఎం కెసిఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గ్రామాల అభివృద్దికి పెద్ద పీట వేశారన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News