Tuesday, January 21, 2025

గెలుపే వారి చూపు

- Advertisement -
- Advertisement -

1981లో పారిస్‌లో మొదలైన ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్ కళ్లు కనబడని వారితో వీలైనన్ని ఆటలు, పోటీలు నిర్వహిస్తోంది. కప్పు, పతకాలు అందించి వారిలో ప్రోత్సాహ ఉత్సాహాలను నింపుతోంది. 2012 నుండి పురుషుల, మహిళల టి 20 గేమ్స్ ఆరంభించి ఈ క్రీడలకు గుర్తింపును తెస్తోంది. ఇప్పటి వరకు 5 వరల్డ్ కప్ పోటీలు జరిగాయి. ఇందులో ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, సౌత్‌ఆఫ్రికా, ఆస్టేలియా దేశాల జట్లు ముందంజలో ఉన్నాయి. సాధారణ క్రికెట్ మౌలిక సూత్రాలను కాపాడుతూ చూపును సవాలుగా తీసుకున్న ఈ క్రీడాకారులను దృష్టిలో పెట్టుకొని ఆట నియమాల రూపకల్పన జరిగింది. పైకి చూడ్డానికి వీరి ఆట మామూలు క్రికెట్ లా కనబడినా కొన్ని ప్రత్యేక రూల్స్ తో ఇది సాగుతుంది. ఈ క్రీడాకారులకు ప్రధాన అనుకూల అంశం వారు వాడే బాల్. అది మాములు సైజు కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. కదిలితే శబ్దం వచ్చేలా బాల్ బేరింగ్స్ ఇందులో ఉంటాయి.

భారత్ అంధుల మహిళా క్రికెట్ జట్టు గోల్డ్ మెడల్‌ను సాధించింది’ అని స్పోర్ట్ పేజీలో ఈ మధ్య వచ్చిన ఓ వార్త. మన దేశ మహిళలే కాదు కనుచూపు కరువైన పురుషుల భారత క్రికెట్ జట్టు కూడా అన్ని ఫార్మాట్లలో ఆడి వరుసగా ప్రపంచ కప్‌లను కైవసం చేసుకుంటోంది. మామూలుగా చూస్తే రోజూ ఆటగాళ్ల ఫోటోలతో మెరిసిపోయే క్రీడల ముచ్చట్లలో ఇదొకటి. కొద్దిగా ఆలోచిస్తే మాత్రం ఇవి అసాధారణ వార్తలు.నిజానికి కళ్ళు తెరిచి పత్రికలోనో, టీవీలోనో ఇలాంటి విశేషం చూసినపుడు ‘అవును.. అసలు కళ్లులేనివారు క్రికెట్ ఎలా ఆడతారు’ అనే సందేహం కలగాలి. అలా కలగకపోవడమూ ఓ రకంగా అంధత్వమే! ఇప్పటికైనా ఆసక్తి కలిగితే మామూలు క్రికెట్‌కు, అంధుల క్రికెట్‌కు గల వ్యత్యాసాలను తెలుసుకోకుండా ఉండలేం.1981లో పారిస్‌లో మొదలైన ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్ కళ్లు కనబడని వారితో వీలైనన్ని ఆటలు, పోటీలు నిర్వహిస్తోంది. కప్పు, పతకాలు అందించి వారిలో ప్రోత్సాహ ఉత్సాహాలను నింపుతోంది.

2012 నుండి పురుషుల, మహిళల టి 20 గేమ్స్ ఆరంభించి ఈ క్రీడలకు గుర్తింపును తెస్తోంది. ఇప్పటి వరకు 5 వరల్డ్ కప్ పోటీలు జరిగాయి. ఇందులో ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, సౌత్‌ఆఫ్రికా, ఆస్టేలియా దేశాల జట్లు ముందంజలో ఉన్నాయి. సాధారణ క్రికెట్ మౌలిక సూత్రాలను కాపాడుతూ చూపును సవాలుగా తీసుకున్న ఈ క్రీడాకారులను దృష్టిలో పెట్టుకొని ఆట నియమాల రూపకల్పన జరిగింది. పైకి చూడ్డానికి వీరి ఆట మామూలు క్రికెట్ లా కనబడినా కొన్ని ప్రత్యేక రూల్స్ తో ఇది సాగుతుంది. ఈ క్రీడాకారులకు ప్రధాన అనుకూల అంశం వారు వాడే బాల్. అది మాములు సైజు కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. కదిలితే శబ్దం వచ్చేలా బాల్ బేరింగ్స్ ఇందులో ఉంటాయి.

బౌలింగ్ విషయంలో చేయి భుజమెత్తు దాటకుండా బంతిని నేలబారుగా విసరాలి. బంతి పైకి లేస్తే బ్యాట్స్ మాన్‌ను చేరే లోపు పిచ్‌పై కనీసం రెండు సార్లు తాకాలి. బ్యాట్స్ మాన్ బ్యాట్‌ను పైకి ఎత్తకుండా స్వీప్ షాట్ కొట్టడానికే ఛాయిస్ తీసుకుంటారు. బౌలర్ నోటితో చేసే శబ్దాలు చాలా కీలకం. అవి స్ట్రైకర్‌కు మార్గ నిర్దేశం చేస్తాయి. బాల్ వేసే ముందు బౌలర్ ‘రెడీ’ అని బ్యాట్స్ మాన్‌కి వినబడేలా తప్పక అనాలి. దానికి జవాబుగా బ్యాట్స్ మాన్ ‘ఎస్’ అని బదులియ్యాలి. బాల్ విసిరినాక బౌలర్ ‘ప్లే’ అని అనాలి. రెడీ, ప్లే అనకుండా బాల్ వేస్తే అది నో బాల్ అవుతుంది. ప్లే అనే మాట చాలా కీలకమైనది. సరిగ్గా బాల్ విసిరినాక ‘ప్లే’ అనాలి. విసురుతూ అన్నా, వేసినాక కొద్ది సేపటికి అన్నా ఆ బాల్ ని అంపైర్ నో బాల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. వికెట్లు తీయడం, రన్స్ సాధించడం అంతా మామూలే. స్టంప్స్ సైజులో కొంచెం పెద్దగా కర్రతో లేదా ప్లాస్టిక్‌తో చేసినవి వాడుతారు. వాటిపై నారింజ లేదా ఎరుపు ఫ్లోరోసెంట్ రంగు తప్పకుండా ఉండాలి. స్టంప్స్‌కి బెయిల్స్ అతికించి ఉంటాయి. ఫీల్డ్ ఏరియా కూడా కొంత తక్కువగా ఉంటుంది.

బౌండరీ దూరం సాధారణంగా 64 మీటర్లు ఉంటే, బ్లైండ్ క్రికెట్‌లో 40 మీటర్లు మాత్రమే ఉంటుంది. పూర్తి చూపులేని వారు బ్యాటింగ్ సమయంలో మరో ఆటగాడిని రన్నర్‌గా పెట్టుకోవచ్చు. జట్టు ఏర్పాటు మరో కీలకమైన అంశం. వైద్యశాస్త్రం ప్రకారం దృష్టి లోపం అనేది పలు రకాలుగా ఉంటుంది. కొందరు కొంత దూరం వరకే చూడగలుగుతారు. కొందరికి చూపు మసగ్గా ఉంటుంది. అలా చూపు తారతమ్యాలు గల వారిని డాక్టర్ పరీక్షించి అంధత్వ శాతం ధ్రువీకరిస్తారు. వాటి ఆధారంగానే జట్టులోకి ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. పూర్తిగా చూపులేని నలుగురు బి 1 గా, రెండు మీటర్ల దాకా చూపు సారించే ముగ్గురు బి 2 గా, ఆరు మీటర్ల వరకు చూడగలిగే ముగ్గురు బి 3 గా విభజిస్తారు. సాధారణ మనిషి 60 మీటర్ల దాక చూడగలడు. పూర్తి అంధత్వం ఉన్న క్రీడాకారుడికి స్టంప్ అవుట్ ఉండదు. రెండోసారి ఎల్‌బి డబ్ల్యు కి అవుట్ ఇస్తారు. ఒకసారి నేలకు తాకి ఎగిరిన బంతిని క్యాచ్ పట్టినా అవుట్ ఇస్తారు.

బ్లైండ్స్ క్రికెట్‌ను 40 ఓవర్ వన్ డే, మూడు రోజుల టెస్ట్ మ్యాచ్, టి 20 ఇలా మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారు. అయిదు వరల్డ్ కప్‌లలో మొదటిది 1998 ఢిల్లీలో జరిగింది. తొలి వరల్డ్ కప్‌లో సౌత్ ఆఫ్రికా జట్టు నెగ్గింది. తరువాత రెండు కప్పులు పాకిస్తాన్ సాధించింది. 2014, 2018లో ఇండియా విజేతగా నిలిచింది. 2012 , 2017, 2022లో జరిగిన బ్లైండ్ క్రికెట్ టి 20 వరల్డ్ కప్‌లో ఇండియా గెలుపొందింది. 2012లో టి 20 కి శేఖర్ నాయక్ కెప్టెన్‌గా ఉన్నారు. అన్ని రకాల 63 మ్యాచులు ఆడి 32 సెంచరీలు చేసిన ఆటగాడు ఆయన. ఫైనల్ లో నాయక్ 58 బంతుల్లో 134 పరుగులు చేశాడు. ఇది ప్రపంచ రికార్డు. కర్ణాటకలోని పేద కుటుంబంలో పుట్టిన ఆయనకు బెంగళూరుకు చెందిన ‘సమర్దనం’ అనే ఎన్జీవో నెలకు రూ. 15 వేలు అందిస్తోంది. నేత్ర దివ్యాంగుల భారత జట్టులో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు క్రీడాకారులున్నారు. వారిలో బి 2 కి చెందిన ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి కెప్టెన్‌గా జట్టుకు విజయాల్ని అందిస్తున్నారు. బాల్యంలో చీకట్లో తలుపు గొళ్ళెం తాకి ఒక కంటిచూపు పోగా సరియైన వైద్యం అందక ఇన్ఫెక్షన్‌తో మరో కంటి చూపు మసకబారింది.

మామూలు స్కూలు నుండి బ్లైండ్ స్కూలుకు మారి డిగ్రీ చదివి ఇప్పుడు స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. చూపు ఉన్నప్పుడు ఉన్న క్రికెట్ పిచ్చిని వదులుకోలేక దెబ్బలకు ఓర్చుకుంటూ క్రికెట్‌లో కొనసాగాడు. ఆ శ్రమ, పట్టుదల ఆయన్ని జట్టును నడిపించే స్థాయికి తెచ్చింది. 2107 లో టి 20 గెలుపు, 2018లో వరల్డ్ కప్ ఆయన సారథ్యంలో సాధించిన విజయాలే.

ఆగస్టులో ఐదు దేశాల మధ్య ఇంగ్లాండ్‌లో జరిగిన ఐబిఎస్‌ఎ వరల్డ్ కప్ 2023లో గోల్డ్ మెడల్ పాకిస్తాన్‌కు రాగా, సిల్వర్ మెడల్‌తో భారత్ రెండో స్థానంలో నిలిచింది. బి 3 కి చెందిన సుష్మా పటేల్ కెప్టెన్‌గా ఉన్న మహిళల జట్టు ఆస్ట్రేలియాను ఓడించి స్వర్ణాన్ని సాధించింది. మధ్యప్రదేశ్‌లోని ఓ కుగ్రామానికి చెందిన సుష్మా పేద రైతు కూతురు. చిన్నప్పుడు విల్లు, బాణంతో ఆడుకుంటుండగా బాణం కంటికి తాకి ఓ కంటి చూపు పోయింది.

అదే ఇన్ఫెక్షన్‌తో మరో కన్ను కూడా దెబ్బ తిన్నది. పట్టుదలతో ఆడి తొలిసారిగా భారత జట్టులో చేరి దేశానికి విజయాన్ని అందించింది. ఇంత చేసినా వీరి శ్రమకు బిసిసిఐ గుర్తింపు లేదు. అందువల్ల ఎలాంటి నిధుల కేటాయింపు లభించడం లేదు. ఖేల్ రత్న, అర్జున్ అవార్డులకు వీరు అర్హులు కారు. స్పాన్సర్ల ఉపకార వేతనాలతో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఒఎన్‌జిసి ప్రధాన స్పాన్సర్స్ గా ‘సమర్దనం’ ట్రస్ట్‌కు సాయపడుతున్నాయి. 2014 నుంచి కేంద్ర క్రీడల శాఖ ప్రపంచ స్థాయి పోటీల్లో గెలిచినప్పుడు మాత్రం టీమ్‌లో ఒక్కొక్కరికి రూ. 5 లక్షలను అందిస్తోంది. వీరి కష్టం తెలిశాక ధోని, కోహ్లీల అంత కాకున్నా దాన్లో ఎంతో కొంతైనా కీర్తి కనకాలు న్యాయంగా వీరికి దక్కాలి కదా అని అనిపిస్తుంది కదూ!

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News