Monday, December 23, 2024

అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిబ్బందిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. శుక్రవారం ఆశా, ఏఎన్‌ఎం, మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ డిఎంహెచ్వో, డిఎంహెచ్వోలతో మంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలలో సాధించిన పురోగతిని సబ్ సెంటర్, పీహెచ్సీ వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు జరిగేలా చూసి, మందులు, కళ్ల అద్దాలు అందించడంలో క్షేత్రస్థాయిలో ఉండే ఆశాలు, ఏఎన్‌ఎంల పాత్ర కీలకమన్నారు.

సబ్ సెంటర్, పీహెచ్సీల పరిధిలో రోజు వారీగా అందే వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. నివారింపదగ్గ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈ నెలలో చేపట్టే కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు. రోగాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి, ముదరకుండా, తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా ప్రజలను కాపాడటంలో సబ్ సెంటర్లు, పిహెచ్సీలదే కీలక పాత్ర ఉంటుందన్నారు. ప్రాథమిక వైద్యారోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేయడంలో భాగంగా, సిఎం కెసిఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 929 వైద్యులను భర్తీ చేయడం జరిగిందన్నారు. సబ్ సెంటర్లు, పీహెచ్సీల మరమ్మతులు, నిర్మాణాలు చేసుకుంటూనే, మరోవైపు ఒక్క ఖాళీ లేకుండా డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది భర్తీ చేసుకుంటున్నామన్నారు.

కొత్తగా విధుల్లో చేరిన డాక్టర్లు నూతనోత్సాహంతో, అంకిత భావంతో పని చేసి పేద, గ్రామీణ ప్రజల మన్ననలు పొందాలన్నారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కృషితో ఎంఎంఆర్ తెలంగాణ ఏర్పడ్డ నాడు 92 ఉంటే, ఇప్పుడు 43కు తగ్గిందని, ఐఎంఆర్ 39 నుంచి 23కు తగ్గిందన్నారు. ‘ఆసుపత్రికి వచ్చే వారు మన చెల్లి, మన బిడ్డ, మన తల్లిగా, మన కుటుంబ సభ్యులుగా భావించి వైద్య సేవలు అందిద్దాం. ఒక్కరు చేసిన తప్పుకు అందరం బాధపడాల్సిన పరిస్థితి రావొద్దు. పేరు పేరునా ప్రార్థిస్తున్నా బాధ్యతతో పేద ప్రజలకు సేవ చేద్దాం’. అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెంచే విషయంలో కెసిఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలు సహా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని మంత్రి చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు కేవలం 30 శాతం ఉంటే ఇప్పుడు 66 శాతానికి పెరిగిందన్నారు. డిసెంబర్ నెలలో చూస్తే, ప్రభుత్వ ఆసుపత్రుల డెలివరీల విషయంలో సంగారెడ్డి జిల్లా టాప్ స్థానంలో ఉందన్నారు. అత్యధికంగా 86 శాతం ప్రభుత్వ డెలివరీలు చేసి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలకు, వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. సబ్ సెంటర్ల వారీగా జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట్ జిల్లాల్లో ఎక్కువ ప్రైవేటు ఆసుపత్రుల డెలివరీలు జరుగుతున్నాయని, వీటిపై డిఎంహెచ్వో, ప్రోగ్రాం ఆఫీసర్లు, డిప్యూటీ డింహెచ్వో క్షేత్ర స్థాయి పర్యటన చేసి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.

నల్గొండ, రంగారెడ్డిలో ప్రైవేటులో ఎక్కువగా సి- సెక్షన్లు జరుగుతున్నాయని, దీనిపై పరిశీలన చేయాలన్నారు. అనవసర సి సెక్షన్లు తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలని చెప్పారు. మూడు నెలల ఓపీ పరిశీలిస్తే, రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఓపీ నమోదు చేస్తున్న జిల్లాలైన నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, కుమ్రంభీం, జనగాం జిల్లాల్లో పరిస్థితులు మారాలన్నారు. కెసిఆర్ కిట్‌లో భాగంగా ప్రతి గర్భిణి నాలుగు ఏఎన్సీ చెకప్స్ క్రమం తప్పకుండా చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సౌకర్యం తీసుకురావడం జరిగిందని, సేవలు గర్బిణులకు అందేలా చూడాలన్నారు. టెలికాన్ఫరెన్స్ సమీక్షలో కుటుంబ, ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతామహంతి, డిఎంఇ రమేష్‌రెడ్డి, డిపిహెచ్ శ్రీనివాస్‌రావు, టివివిపి కమిషనర్ అజయ్‌కుమార్, అన్ని జిల్లాల డిఎంహెచ్వోలు, డిప్యూటీ డిఎంహెచ్వోలు, ప్రాగ్రాం ఆఫీసర్లు, హెల్త్ సూపర్ వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాలు, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News