నియుక్త విదేశాంగ మంత్రి బ్లింకెన్
వాషింగ్టన్ : అమెరికా ప్రపంచదేశాలన్నింటితో సంప్రదింపుల పర్వం చేపడుతుందని ఆంటోని బ్లింకెన్ తెలిపారు. బైడెన్ కేబినెట్‌లో బ్లింకెన్ కొత్త విదేశాంగ మంత్రి కానున్నారు. ఈ దశలో మంగళవారం ఆయన దేశ విదేశాంగ విధానాన్ని సూచన ప్రాయంగా వివరించారు. వాస్తవికతలు, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగానే దేశ కొత్త అధ్యక్షుడి దౌత్యనీతి ఉంటుందని తెలిపారు. అమెరికా ఉండాల్సిన విధానాలలో ఇప్పుడు లేదని, ఈ తరుణంలో పద్థతులు మారాల్సి ఉందని తెలిపారు. అమెరికాకు ఓ వైపు రష్యా మరో వైపు చైనాలతో వైరం పెరుగుతోందని, ఇది ప్రపంచ వ్యవస్థకు చేటుగా ఉంటుందని తెలిపారు.
ఇంతకు ముందటి సవ్యమైన పరిస్థితి పునరుద్ధరణ జరగాలనేదే తపన అన్నారు. ఒక్కరోజులో దేశ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టే బ్లింకెన్ సెనెట్ కమిటీ ముందు విదేశాంగ వ్యవహారాలపై తమ వాదనను విన్పించారు. ఇతర అన్ని దేశాలతో సామరస్య స్థాపన జరుగుతుందని, ఇదే దశలో ఎక్కడైనా అమెరికన్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే , నష్టం జరిగితే వెంటనే సైనిక జోక్యం తప్పదని హెచ్చరించారు. వివిధ దేశాల ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు చర్చల ప్రక్రియ సాగుతుందని , అన్ని అంశాలపై ఏకాభిప్రాయసాధనకు పాటుపడుతామని తెలిపారు.
భాగస్వామ్య పక్ష దేశాలతో స్నేహ సంబంధాల పటిష్టతనే కీలకం అన్నారు. కొన్ని దేశాలతో ఉన్న వైరం సరిదిద్దుకునేందుకు పాటుపడుతామని, అమెరికా విదేశాంగ విధాన పరంగా తిరిగి గాడీలో పడటమే తమ ముందున్న కర్తవ్యం అన్నారు. సమకాలీన తీవ్రస్థాయి సవాళ్లను తగు విధంగా పరిష్కరించుకుంటామని హామీ ఇచ్చారు. అన్ని పద్థతులను సరిపోల్చుకుని అమెరికా సెనెట్ బ్లింకెన్‌కు దేశ విదేశాంగ మంత్రిగా ఆమోద ముద్ర వేసింది. దీనితో ఇప్పుడున్న విదేశాంగ మంత్రి మైక్ పాంపయో స్థానంలో ఇకపై బ్లింకెన్ ఈ బాధ్యతలలో ఉంటారు.
జాతీయవాద ఉధృతి ప్రపంచం, ప్రజాస్వామ్య తిరోముఖం, చైనా రష్యాలతో శత్రుత్వపు పోకడలు, ఇతర ఆధిప్యత దేశాలతో పోరు వంటివి తమ ముందు ఉన్న సవాళ్లని తెలిపారు. స్థిరమైన, విశాల దృక్పధపు అంతర్జాతీయ వ్యవస్థలకు తలెత్తుతున్న సవాళ్లను తిప్పికొట్టాల్సి ఉందన్నారు. ఇక మనిషి జీవన సరళిని అన్ని కోణాల్లో మార్చే విధంగా సాంకేతిక విప్లవం దూసుకువస్తోందని, ఇందులో ప్రధానమైన పరిణామాలు సైబర్ స్పేస్‌తో తలెత్తుతున్నాయని వివరించారు. హుందాతనం, ఆత్మవిశ్వాసం అమెరికా నాయకత్వపు నాణెనికి రెండంచులు అవుతాయని చెప్పారు. బ్లింకెన్ బరాక్ ఒబామా హయాంలో దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా 201517 వరకూ వ్యవహరించారు.
కీలక మంత్రుల ధృవీకరణ
బుధవారం బైడెన్, కమలా హారిస్‌లు బాధ్యతలు చేపట్టడానికి ఒక్కరోజు ముందు సెనెట్ కమిటీ కీలక శాఖల మంత్రుల నియామక ప్రక్రియను ధృవీకరించే ఘట్టం చేపట్టింది. బైడెన్ ఎంచుకున్న కేబినెట్ మంత్రులు నియమావళి మేరకు సెనెట్ కమిటీ ఎదుట తమ వివరణలు ఇచ్చుకున్నారు. ఇందులో భాగంగా దేశ ఆర్థిక మంత్రిగా జనెట్ అలెన్, రక్షణ మంత్రిగా లాయడ్ జె ఆస్టిన్, అంతర్గత భద్రతా మంత్రిగా అలెజెండ్రో ఎన్ మేయర్‌కస్ తమ పత్రాలను సమర్పించారు. ఇక అత్యంత కీలకమైన దేశ ఇంటలిజెన్స్ సంచాలకులుగా అవ్రిల్ హైనెస్ బాధ్యతలు నిర్వర్తించేందుకు తమ అర్హతలను సెనెట్ కమిటీకి తెలియచేసుకున్నారు.