అష్రఫ్ ఘనీపై బ్లింకెన్ స్పందన
వాషింగ్టన్ : ప్రాణం ఉన్నంతవరకూ పోరు అన్నాడు కానీ మధ్యలోనే ఫరారయ్యాడు అని అఫ్ఘన్ మాజీ అధ్యక్షులు అఫ్రఫ్ ఘనీ గురించి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. టోలోన్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో బ్లింకెన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు తమ ప్రాబల్యం చాటుకున్న దశలో ఘనీ యుఎఇకి తరలివెళ్లారు. దేశాన్ని తాలిబన్ల పరం చేశారు. ఘనీ దేశం వదిలివెళ్లడంలో అమెరికా సాయం చేసిందా? అని అడిగిన ప్రశ్నకు బ్లింకెన్ స్పందించారు. ఫరారీకి ముందు రోజు రాత్రి తనతో ఘనీ ఫోన్‌లో మాట్లాడారని, అప్పుడు తుదివరకూ పోరాడుతానని చెప్పారని తెలిపారు. మరుసటి రోజు ఆయన దేశం దాటి పోయినట్లు తనకు తెలిసిందన్నారు. బుధవారమే ఘనీ ఓ కీలక ప్రకటన వెలువరించారు. దేశం వీడిపోవడం తప్పనిసరి పరిస్థితులలో జరిగిందని, తన రాజభవనం భద్రతా సిబ్బంది ఇచ్చిన సలహా మేరకు తానీవిధంగా చేశానని, ఇందుకు ప్రజలకు క్షమాపణ చెపుతున్నానని ఈ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 15వ తేదీ రాత్రి జరిగిన పరిణామాలను అఫ్ఘన్లకు తెలియచేయాల్సిన బాధ్యత తనపై ఉందని తాను భావిస్తున్నానని, అందుకే ఈ ప్రకటన వెలువరిస్తున్నానని తెలిపారు.