Sunday, January 5, 2025

ఈడి విచారణకు గైర్హాజరైన బిఎల్‌ఎన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడి విచారణకు హెచ్‌ఎండిఏ రిటైర్డు చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి గురువారం గైర్హాజర్ అయ్యారు. తనకు మరికొంత సమయం కావాలని ఈ నెల 8 వ తేదిన విచారణకు వస్తానని ఆయన ఈడికి మెయిల్ ద్వారా తెలియజేసారు. అలాగే శుక్రవారం ఈడి విచారణకు హాజరు కావాల్సిన ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ కూడా తాను ఈ నెల 9న హాజరుకానున్నట్టు ఈడి అధికారులకు మెయిల్ పంపించారు. వీరి విజప్తికి ఈడి కూడా సానుకూలంగా స్పందించింది.
ఇదే కేసులో ఈడి నుంచి సమన్లు అందుకున్న ఎ1 నిందితుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కెటిఆర్ ఈ నెల 7న విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన హాజరు కూడా అనుమానమేనని అంటున్నారు.ఇదే కేసులో తనపై ఎసిబి నమోదు చేసిన కేసు అక్రమమని కెటిఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకంతోనే గురు, శుక్రవారాలలో ఈడి విచారణకు బిఎల్‌ఎన్ రెడ్డి , అర్వింద్‌కుమార్ గైరాహజర్ అయి ఉంటారనే ప్రచారం జరుగుతోంది.

ఈ రేసు కార్ ఉదంతంలో తనపై ఎసిబి నమోదు చేయడం, దాని ఆధారంగా ఈడి కూడా కేసు నమోదు చేయడాన్ని కెటిఆర్ హైకోర్టులో సవాల్ చేయగా, ఆయన తరఫున హైకోర్టులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో అసలు అవినీతే జరగలేదన్నది కెటిఆర్ వాదన. ఈ రేస్ పై 14 నెలలు తర్వాత కేసు పెట్టారని, ఇది పూర్తిగా రాజకీయ కక్షగా ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించగా, ప్రభుత్వం తరఫున ఎజి సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు దశలో ఉందని, ఈ సమయంలో అడ్డుకోవడం సరికాదని ఎజి హైకోర్టును కోరిన విషయం తెలిసిందే. ఇరు పక్షాల వాదనల తర్వాత క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టడంతో పాటు తీర్పు వెల్లడించే వరకు కెటిఆర్‌ను అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు లో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న అంచనాతోనే ఈ కేసులో ఎ౩ బిఎల్‌ఎన్ రెడ్డి, ఎ2 అర్వింద్‌కుమార్ ఈడి విచారణకు హాజరు కాకుండా గడువు కోరినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ-కార్ రేసు పై ఎసిబి పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేస్తే, అప్పుడు ఈడి పెట్టిన కేసు కూడా ఉండదని బిఎల్‌ఎన్ రెడ్డి, అర్వింద్‌కుమార్ ధీమాగా ఉన్నట్టు తెలిసింది.ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఇడి విచారణకు కెటిఆర్ హాజరు కావడం కూడా అనుమానమేనని ఈవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు ఈడి నోటీసు
ఈ కార్ -రేస్ నిర్వహణకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే సంస్థకు నేరుగా రూ. 45.71 కోట్లను యుకె కరెన్సీని పౌండ్ల రూపంలో బదిలీ చేసిన వ్యవహారం పై ఇడి ఆరా తీస్తోంది. ఈ కారు రేస్ నిర్వహణ లో ఆర్థిక లావాదేవీలలో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తాజాగా ఈడి తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు నిధులను బదిలీ చేసిన హైదరాబాద్ హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీన్ బ్యాంక్‌కు కూడా ఈడి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఎవరి ఆదేశాలతో విదేశీ సంస్థకు నిధులు చెల్లించారనే కోణంలో ఈడి ఆరా తీస్తోన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News