లండన్: స్కాట్లాండ్‌లో భారత హైకమిషనర్‌ను ఖలిస్థానీ సానుభూతిపరులు అడ్డుకోవడంపై గ్లాస్గో నగర గురుద్వారా స్పందించింది.అది పూర్తిగా క్రమశిక్షణారాహిత్య చర్య అని అభివర్ణించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. గురుద్వారా అందరి కోసం తెరిచే ఉంటుందని తెలిపింది. భారత రాయబారి వెళ్లిన తర్వాత కూడా ఖలిస్థానీసానుభూతిపరులు గురుద్వారా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని పేర్కొంది. ‘ సెప్టెంబర్ 29న స్కాట్లాండ్ పార్లమెంటు సభ్యుడి ఆహ్వానం మేరకు గ్లాస్గో గురుద్వారా సందర్శనకు భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి వచ్చారు.
కానీ ఆయనను కొందరు వ్యక్తులు గురుద్వారాలోనికి రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడినుంచి వెళ్లిపోయారు. శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే విధంగా కొందరు ప్రవర్తించిన తీరును గురుద్వారా తీవ్రంగా ఖండిస్తోంది. గురుద్వారాకు ఎలాంటి పక్షపాతం లేదు. అందరి కోసం గురుద్వారా తలుపులు తెరిచే ఉంటాయి’ అని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. దీన్నో అవమానకర సంఘటనగా అభివర్ణించింది. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వానికి అధికారికంగా ఫిర్యాదు చేసింది కూడా.