న్యూఢిల్లీ : ఒక నిర్దిష్టమైన రక్త క్యాన్సర్ల చికిత్స కోసం భారతదేశంలో స్వయంగా అభివృద్ధి చేసిన జన్యథెరపీ క్లినికల్ ట్రయల్స్‌లో 73 శాతం మంది రోగుల్లో సానుకూల స్పందన కనిపించింది. ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు “ది లాన్సెట్ హిమటాలజీ జర్నల్” లో ప్రచురించారు. ఈ చికిత్సను కార్‌టి సెల్ థెరపీ అని పిలుస్తున్నారు.రక్తక్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాద పరిస్థితుల్లో ఉన్న రోగులకు కూడా ఈ కార్‌టి సెల్ థెరపీ జీవించడానికి మరో అవకాశం కల్పిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కార్‌టి సెల్ థెరపీ లో తెల్లరక్త కణాల్లోని ముఖ్యమైన కణాల్లో ఒకటైన టిసెల్స్ అంటే ఇవి ఒకవిధమైన వ్యాధి నిరోధక కణాలు( ఇమ్యూన్ సెల్స్)లోని జన్యువులను క్యాన్సర్‌తో పోరాటానికి సహకరించేలా మార్పు చేస్తారు. లుకేమియాతో బాధపడే రోగులను ఈ పరిశోధనలో గుర్తించారు.
లుకేమియా ఎముకల మజ్జ లోను, లింఫోమా (శోషరస వ్యవస్థపై ప్రభావం చూపించే క్యాన్సర్) కాన్యర్ రోగులపై అధ్యయనం నిర్వహించారు. ముంబైకి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టాటా మెమోరియల్ ఆస్పత్రి పరిశోధకులు మాట్లాడుతూ స్వల్ప, మధ్యాదాయ దేశాల్లో బిసెల్ క్యాన్సర్ టూమర్లు కలిగిన రోగులు సరైన వైద్య చికిత్స లేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ బి సెల్ ట్యూమర్లు ఎలాంటి చికిత్సకు స్పందించవని చెప్పారు. ఒకరకమైన తెల్ల రక్తకణాలే బిసెల్స్. మనిషి లోని వ్యాధినిరోధక శక్తికి ఈ కణాలు కీలకం. ఇన్‌ఫెక్షన్లతో పోరాటం చేయడానికి కావలసిన యాంటీబాడీలను ఇవి సృష్ఠిస్తాయి. స్వదేశంలో క్యాన్సర్‌ను నివారించే మొట్టమొదటి జన్యు థెరపీ ఇదేనని పరిశోధకులు వెల్లడించారు.
ఈ రోగులు జీవించే మరో అవకాశాన్ని ఇది కల్పిస్తుందన్నారు. దీనికోసం మరో ఔషధాన్ని వైద్యులు ప్రయత్నించగలుగుతారని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ఐఐటీ బాంబే ప్రొఫెసర్, ఇమ్యునో యాక్ట్ వ్యవస్థాపకులు రాహుల్ పుర్వార్ వెల్లడించారు. కార్‌టి సెల్స్ శరీరంలో సుదీర్ఘకాలం స్థిరంగా ఉంటాయని, ఇవి క్యాన్సర్ పునరుత్పత్తి కాకుండా నివారించగలుగుతాయని టాటా మెమోరియల్ ఆస్పత్రి లోని మెడికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హస్‌ముఖ్ జైన్ వివరించారు. కార్‌టి సెల్ థెరపీ కూడా ఎంతో వ్యయంతో కూడుకున్న ప్రత్యామ్నాయ చికిత్స అని, దీన్ని దాదాపు 11 ఏళ్ల పాటు అభివృద్ధి చేశామని రాహుల్ పుర్వార్ పేర్కొన్నారు. దీనికి టాలికాబ్టాజీన్ అనే ఇంజెక్షన్ భారత్‌లో ఆమోదం పొందిందని, మిగతా దేశాల్లో దీని థరలో పదోవంతు తక్కువగా 30,000 డాలర్లకు లభ్యమవుతోందని చెప్పారు.