పంజాబ్‌లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు
చండీగఢ్ : తాగి ఓవర్ స్పీడ్‌తో వాహనాలు నడిపే మందుబాబులకు వేలకు వేలు జరిమానాలు విధించినా, లైసెన్సులు రద్దు చేసినా దారికి రావడం లేదు. అందుకని పంజాబ్ ప్రభుత్వం ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఆమోదించిన ఈ నిబంధనల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన మందుబాబులు రక్తదానం చేయాలి లేదా సమీప ఆస్పత్రుల్లో కొన్ని గంటల పాటు రోగులకు సేవలు చేయాలి. అంతేకాదు నిందితులు రవాణా అధికార యంత్రాంగం నుంచి పునశ్చరణ తరగతులు అభ్యసించిన తరువాత 9 నుంచి 12 వ తరగతి చదివే కనీసం ఇరవై మందికైనా చిన్నారులకు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి.
ఈమేరకు రవాణా శాఖ నుంచి రిఫ్రెషర్ కోర్సుకు సంబంధించిన ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి లైసెన్సులు మూడు నెలల పాటు రద్దు చేస్తారు. ఇందులో ఓవర్ స్పీడ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడటం, డ్రంక్ అండ్ డ్రైవ్, సిగ్నల్ తప్పించుకోవడం వంటివి ఉన్నాయి. మొదటిసారి వెయ్యి, రెండోసారి దొరికితే రెండింతలు జరిమానా విధిస్తారు.డ్రంక్ అండ్ డ్రైవింగ్‌కు రూ. 10,000 జరిమానా, లైసెన్సు మూడు నెలల పాటు రద్దు ఉంటుంది. మొబైల్ వాడితే రూ. 5 వేలు జరిమానా, రెండోసారి అలాగే వాడితే డబుల్ జరిమానా విధిస్తారు. అలాగే ఓవర్ లోడ్ వాహనాలకు ఒకసారి రూ. 20 వేలు , రెండోసారి రెట్టింపు జరిమానా విధిస్తారు. .