నాగర్‌కర్నూల్ : ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు లేకుండా తయారు చేసుకోవడంలో బూత్ లెవెల్ అధికారులది కీలక పాత్ర ఉంటుందని కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా, నియోజకవర్గ ఎన్నికల శిక్షకులతో సమీక్ష నిర్వహించి వారికి పవర్ ప్రజంటేషన్ ద్వారా సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి శుద్ధమైన ఓటరు జాబితా రూపొందించుకోవడం చాలా అవసరమన్నారు. తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేసుకునేందుకు బూత్ స్థాయిలో బిఎల్‌ఓలది కీలక పాత్ర ఉంటుందని అన్నారు. ఇంటింటికి తిరిగి పూర్తి వివరాలు, తగిన ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత బిఎల్‌ఓలపై ఉంటుందన్నారు.
అందువల్ల ప్రస్తుతం స్పెషల్ సమ్మరి రివిజన్ 2 ప్రకారం వచ్చిన నిబంధనలు, మార్పులు, సడలింపులపై బిఎల్‌ఓలకు మంచి శిక్షణ ఇచ్చి వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఫారం 6, 7,8పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. జిల్లా స్థాయి ఎన్నికల శిక్షకులు మాస్టర్, ట్రైనర్‌లు నియోజకవర్గ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారని ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏమైనా అనుమా నాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలోఅదనపు కలెక్టర్ మను చౌదరి, మాస్టర్ ట్రైనర్‌లు, నియోజకవర్గ ట్రైనర్‌లు పాల్గొన్నారు.