Monday, January 20, 2025

న్యాయవ్యవస్థపై నీలినీడలు!

- Advertisement -
- Advertisement -

Fuel, food crisis with Russia Ukraine war

మన రాజ్యాంగం, న్యాయవ్యవస్థ పరిణత ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబిస్తాయి . బలహీనులను కాపాడడం ధ్యేయంగా రూపొందాయన్న ఘనతను సొంతం చేసుకొన్నాయి. వెయ్యిమంది దోషులు చట్టం నుంచి తప్పించుకొన్నా ఫర్వాలేదుగాని, వొక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనే మహ దాశయం పునాదిగా నిర్మితమయిన న్యాయవ్యస్థ అప్పీళ్ళ అంచెల అంతస్థుల భ వనంగా అలరారుతున్నది. పదహారణాల ప్రజాస్వామిక న్యాయ విధివిధానాన్ని పాటిస్తూ జనజీవనంలో నీతి, నిజాయితీలకు రక్షణ దుర్గంగా ఉన్నదనే ఖ్యాతిని చూరగొన్నది. పెండింగు కేసుల భారంతో సకాలంలో తీర్పులు ఇవ్వలేకపోడం, లిటిగెంట్ల కాలయాపన వ్యూహాలకు గురి కావడం వంటి కొన్ని కారణాల వల్ల దానిపై నీలినీడలు పడుతున్నప్పటికీ మొత్తం మీద అన్యాయం, అక్రమాలకు గురయ్యే ప్రజల వేదనను వినిపించుకొనే వేదికగా ఇప్పటికీ మన్ననలు పొందుతున్నది. అటువంటి మంచి భవనం పునాదులు కదిలిపోతున్నాయనే అభిప్రాయానికి అవకాశాలేర్పడడం అత్యంత ఆందోళనకరం. ఏభై యేళ్లుగా యీ వ్యవస్థను అంటిపెట్టుకొని ఉన్న పెద్దలే దానిమీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం యిటువంటి ఆందోళనను కలిగిస్తున్నది.

‘న్యాయవ్యవస్థలోని వారే కొందరు దానికి చెరుపు తెస్తున్నారు, ఇటీవల జరిగిన కొన్ని ఘటనలకు సిగ్గుతో తలవంచుకొంటున్నాను.’ అని సుప్రీం కోర్టు న్యాయవాది కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్య యీ సందర్భంగా గమనించదగినది. సిబల్ ప్రముఖ న్యాయవాదే కాక, యుపి ఎ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇటీవలి వరకు కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడుగా ఉన్నారు. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం పోరాడిన అసమ్మతి నేతల్లో వొకరు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. సమాజ్ వాది పార్టీ మద్దతుతో రాజ్యసభకు యెన్నికయ్యారు. కపిల్ సిబల్ యింకా యేమన్నారో చూడండి. వాక్ స్వాతంత్య్రం -సుప్రీం కోర్టు నిర్వచించిన రీతిలో రాజ్యాంగబద్ధంగా మనుగడ సాగించడానికి అవకాశమే లేకుండాపోయింది అని వాపోయారు. న్యాయ వ్యవస్థ ధోరణిపై గతంలో మరో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా నిశిత విమర్శ చేశారు. అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎ బాబ్డే మీదనే ఆయన 2020 జూన్ లో తీవ్రంగా వ్యాఖ్యానించారు.

దేశంలో కరోనా లాక్ డౌన్ అమల్లో ఉండగా భారత ప్రధాన న్యాయమూర్తి హెల్మెట్ గాని మాస్క్ గాని పెట్టుకోకుండా హార్లే డేవిడ్ సన్ బైక్ మీద స్వారీ చేయడాన్ని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఆ సమయంలోనే యింకో ట్వీట్‌లో అప్పటికి ఆరేళ్లుగా దేశంలో ప్రజాస్వామ్యం నాశనం కావడంలో సుప్రీం కోర్టు వహిస్తున్న పాత్రను యెండగట్టారు. యిప్పుడు కపిల్ సిబల్ కూడా యించు మించు అదే విమర్శను యెక్కుబెట్టారు. నేను 50 ఏళ్లుగా వొక సభ్యునిగా ఉన్న న్యాయవ్యవస్థను అందులోనివారే కొందరు భ్రష్టు పట్టిస్తున్నారు, చట్ట పాలనకు, న్యాయానికి ఉల్లంఘనలు అని స్పష్టంగా తెలుస్తున్నవాటిని కూడా న్యాయ స్థానాలు పట్టించుకోడం లేదు. చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికి ఉద్దేశించిన వ్యవస్థే వాటికి జరుగుతున్న ఉల్లంఘనలను కళ్ళారా చూస్తూ ఊరుకోడం సిగ్గు పడవలసిన విషయమని అన్నారు.

బ్రిటన్ నుంచి ఫోన్‌లో పిటిఐ కిచ్చిన ఇంటర్వ్యూలో సిబల్ యీ విధంగా వ్యాఖ్యానించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ ను విమర్శిస్తూ ట్వీట్ పెట్టిన ఢిల్లీ జర్నలిస్టు మొహమ్మద్ జుబైర్ ను అరెస్టు చేయడంపై అడిగిన ప్రశ్నకు సిబల్ యీ విధంగా స్పందించారు. ప్రశాంత్ భూషణ్ గాని, కపిల్ సిబల్ గాని మన అత్యున్నత న్యాయస్థానంపై, న్యాయవ్యవస్థపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో యింత బాధతో వ్యాఖ్యానించడానికి కారణం దేశాన్ని పాలిస్తున్నవారి వైఖరిలో ఉంది. రాజ్యాంగ బద్ధతను కాపా డే ప్రధాన బాధ్యతపై అధికారాన్ని చేపట్టినవారు దానిని నిర్వర్తించకపోగా అందుకు విరుద్ధమైన పోకడలు పోతున్నారు. సెక్యులర్, ప్రజాస్వామ్య ధర్మాన్ని మంటగలపడానికి కంకణం కట్టుకొన్నారు.

అటువంటి సందర్భాల్లో బాధితులు న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తుంటే వారికి దానినుంచి అందవలసిన తోడ్పాటు అందడం లేదు. దేశంలో అప్రకటిత యెమర్జెన్సీ నడుస్తున్నదని యీ సందర్భంలోనే కపిల్ సిబల్ అన్నారు. చట్టబద్ధకు రోజువారీగా తూట్లు పడుతున్నాయన్నారు. గుజరాత్ అల్లర్ల లో హతుడయిన మాజీ ఎమ్‌పి భార్య జకియా జాఫ్రీ అప్పీలును కొట్టివేస్తూ సుప్రీం కోర్టు యిచ్చిన తీర్పు సందర్భంగా కొన్ని వర్గాల్లో వెల్లడైన అసంతృప్తి, ఆ కేసులో న్యాయం జరగలేదని వ్యక్తమైన అభిప్రాయం గమనించదగినవి. యీ తీర్పు వెలువడిన తర్వాత హక్కుల ఉద్యమకారిణి తీస్తా షెతల్వాడ్‌ను అరెస్టు చేయడంపై, ట్వీట్ పెట్టినందుకు, మొహమ్మద్ జుబైర్‌ను అదుపులోకి తీసుకున్నందుకు ఐక్యరాజ్య సమితి పౌరహక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు తాము విచారణ జరుపని కేసుల్లో తీర్పులు చెప్పడం, ప్రభుత్వాల అక్రమ నిర్ణయాలను ధ్రువపరుస్తూ పోవడం జరుగుతున్నదని కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్య న్యాయ వ్యవస్థను మంచికోణంలో యెంతమాత్రం చూపించడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News