Sunday, December 22, 2024

మహేశ్‌బ్యాంక్ హ్యాకర్ కోసం ‘బ్లూకార్నర్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్: మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో విదేశాలలో ఉన్న హ్యాకర్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సమాయత్తమౌతున్నారు. మహేశ్ బ్యాంక్‌లో రూ. 12 కోట్ల మేరకు కొల్లగొట్టిన కేసులో లభించిన ఆధారాల మేరకు హ్యాకింగ్ చేసిన వ్యక్తి ఎవరనేది గుర్తించడానికి బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేస్తున్నామని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సాయంతో ఇంటర్ పోల్ అధికారులకు సైబర్ క్రైం పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు అందజేయనున్నారు. ఈ నోటీసుల్లో హ్యాకర్ ఉపయోగించిన ఫ్రాక్సీ ఐపీలను నోటీసుల్లో పొందుపర్చనున్నారు. ఈ వివరాల ఆధారంగా ఇంటర్ పోల్ అధికారులు ఏ దేశం నుంచి ఐపీలు ఉపయోగించారు, నిందితులు ఎవరనేది దర్యాప్తు చేసి ఆ వివరాలను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు చేరవేస్తారని విచారణాధికారులు వివరిస్తున్నారు. కీలక కేసులలో నిందితుడు ఎవరనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఇంటర్ పోల్ అధికారుల సాయంతో సదరు నిందితుడిని హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని, మహేశ్ బ్యాంక్ కేసులో నిందితుడి ఆధారాలు లేనందున బ్లూ కార్నర్ నోటీసుల ద్వారా ఇంటర్ పోల్ అధికారులను సంప్రదిస్తున్నారన్నది సమాచారం. ఈ కేసులో సేకరించిన ఆధారాల మేరకు నిందితుడెవరో గుర్తించి సంబంధిత పోలీసులకు ఇంటర్ పోల్ అధికారులు సమాచార అందజేయనున్నారు. మహేశ్ బ్యాంక్ సర్వర్‌ను ఫ్రాక్సీ ఐపీలు ఉపయోగించి హ్యాక్ చేసి రూ. 12కోట్లు కొల్లగొట్టారని, ఈ ఫ్రాక్సీ ఐపీలు లండన్, దక్షిణాఫ్రికా, నైజీరియాల పేరుతో చిరునామా చూపిస్తున్నాయని సైబర్ క్రైం పోలీసులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News