విద్యాశాఖాధికారి నిర్వాకం
విద్యాశాఖ మంత్రి పేరు లేని వైనం
సమాచార బోర్డుపై రాతలు మారని వైనం
మన తెలంగాణ/బాన్సువాడ : హవ్వా….! నలుగురు నవ్వి పోదురు గాక అన్న చందంగా తయారైందని బాన్సువాడ విద్యా వనరుల శాఖ కార్యాలయంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కార్యాలయంలో సమాచార బోర్డుపై ఏండ్లు గడుస్తున్నా పాత రాతలే దర్శనమిస్తున్నాయి. ప్రభు త్వం రెండవ సారి అధికారంలోకి వచ్చి మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేపట్టింది. అందులో భాగంగా విద్యాశాఖను సబితా ఇంద్రారెడ్డికి కేటాయించింది.
నాటి నుంచి నేటి వరకు బాన్సువాడ విద్యాశాఖ కార్యాలయ సమాచార బోర్డులో మాత్రం అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేరే కొనసాగుతుంది. ఇది విద్యాశాఖాధికారి పనితీరుకు నిలువెత్తు నిదర్శనం. ముఖ్యమంత్రి కేసిఆర్ మహిళలకు ప్రాధాన్యతను కల్పించాలనే సదుద్దేశ్యంతో మహిళా బంధు సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా జరుపుతున్నారు. కానీ, ఇక్కడి అధికారి మాత్రం సాక్ష్యాత్తు మహిళా విద్యాశాఖ మంత్రి పేరును కనీసం బోర్డు మీద కూడా వ్రాయించలేనంతగా బిజీ బిజీగా ఉంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. మహిళా దినోత్సవం రోజైనా విద్యాశాఖ మంత్రి పేరును బోర్డుపై వ్రాయించి మహిళలకు గౌరవం కల్పించాలని పలువురు మహిళలు కోరుతున్నారు.