లాసెట్ (మూడేళ్ల కోర్సు): జులై 21
లాసెట్ (ఐదేళ్ల కోర్సు) : జులై 22
పిజిఎల్‌సెట్(ఎల్‌ఎల్‌ఎం): జులై 22
ఎడ్‌సెట్ : జులై 26, 27
ఐసెట్: జులై 27, 28
పిజిఇసెట్ జులై 29,30,31, ఆగస్టు 1
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలో ఆన్‌లైన్ పద్ధతిలో 2022 -23 విద్యా సంవత్సరానికిగాను వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిఎస్ లాసెట్, టిఎస్ పిజిఎల్‌సెట్, టిఎస్ ఎడ్‌సెట్, టిఎస్ ఐసెట్, టిఎస్ పిజిఇసెట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ప్రకటించారు. వారం రోజుల్లోగా ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ ఛైర్మన్ వి.వెంకటరమణ, కార్యదర్శి ఎన్.శ్రీనివాస్ ప్రవేశ షెడ్యూల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ, అన్ని సెట్లకు గత ఏడాది నిబంధనలే అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎంసెట్, ఇసెట్ నోటిఫికేషన్లు విడుదల కాగా, ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం కానుంది.