ముంబయి: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లోని సముద్ర తీరంలో ఏకే 47 రైఫిళ్లు, ఇతర ఆయుధాలతో అనుమానాస్పద పడవను గుర్తించారు. రాయగఢ్‌లోని హరిహరేశ్వర్ బీచ్ సమీపంలోని పడవలో ఆయుధాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై ప్రత్యేక విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరినట్లు రాయ్‌గఢ్ ఎమ్మెల్యే అదితి తట్కరే తెలిపారు. పండుగకు ముందు రోజు వెలుగుచూసినందున ఈ సంఘటన పెద్ద భద్రతా భయంగా ఉందని ఆమె అన్నారు.
“రేపు ‘దహీ హండీ’…. గణేశోత్సవానికి కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ పండుగల సమయంలో ప్రజలు ఇక్కడికి వస్తారు. భద్రత ఒక ముఖ్యమైన అంశం” అని శ్రీమతి తట్కరే విలేకరులకు తెలిపారు. ముంబైకి 190 కి.మీ దూరంలో సిబ్బంది లేని బోటును కొందరు స్థానికులు గుర్తించి భద్రతా ఏజన్సీలను అప్రమత్తం చేశారు. రాయ్‌ఘడ్ పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ దూదే, ఇతర సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పడవలో సోదాలు చేశారు. పరిసర ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.