బోధన్ ః హైదరాబాద్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదానికి కారణమైన బోధన్ మాజీ ఎంఎల్‌ఎ షకీల్ కుమారుడు వ్యవహారంలో గతంలో ఇక్కడ పనిచేసిన సిఐ ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సిఐల బదిలీలలో ఆయనను నిజామాబాద్ సిసిఎస్‌కు బదిలీ చేశారు. ఆదివారం ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. బోధన్ మాజీ ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్ నేత షకీల్ కుమారుడు, ఇటీవల హైదరాబాద్‌లో ప్రగతిభవన్ సమీపంలో బారికేడ్లను ఢీకొట్టి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో సంచలనం రేపింది. కారు నడిపింది మాజీ ఎంఎల్‌ఎ షకీల్ కుమారుడు రాహీల అమీర్ కాగా ఆయన స్థానంలో ఇతరులను ఇరికించారు.
ఈ వ్యవహారంలో షకీల్ జోక్యం చేసుకొని పోలీసుల సహాయ సహకారాలతో ఆయన కుమారుడిని తప్పించడంతో పాటు ఇతరులను ఈ కేసులో ఇరికించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై డిజిపి విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో సిటీ పోలీస్ కమిషనర్ సిఐ స్థాయి అధికారులతో పాటు పలువురు కింది స్థాయి సిబ్బందిని సస్పెండ్ చేశారు. పోలీసులు అధికారులు ఈ వ్యవహారంపై తాజా విచారణ జరుపుతూ సిఐ ప్రేమ్ కుమార్ పాత్రపై ఆరా తీశారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందన్న కోణంలో పోలీసు ఉన్నతాధికారులు లోతైన విచారణ చేపడుతున్నారు. సిఐ ప్రేమ్ కుమార్ అరెస్టు వ్యవహారం రాష్ట్ర స్థాయిలో సంచలనం రేపింది. పోలీస్ శాఖలో సైతం ఈ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.