Monday, December 23, 2024

బోధన్‌లో త్రిముఖ పోరు

- Advertisement -
- Advertisement -

నువ్వా నేనా అన్నట్లుగా ప్రధాన పార్టీలు,  బిఆర్‌ఎస్ కాంగ్రెస్, బిజెపి అభ్యర్థుల ప్రచార హోరు

మన తెలంగాణ/బోధన్ : నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో త్రిముఖ పోరు నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. ప్రధాన పార్టీలైన బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిలు గెలుపు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. బోధన్ నియోజక వర్గంలో ప్రతిసారి ఎన్నికల్లో ద్విముఖ పోరు ఉండగా ఈ పర్యాయం మాత్రం త్రిముఖ పోరు నెలకొంది. బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లతో పాటు బిజెపి నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల పోరులో తలపడుతోంది. ఈ పరిస్థితులు నియోజకవర్గంలో ఎన్నికల వేడిని కాక పుట్టిస్తున్నాయి. త్రిముఖ పోరులో ఎవరి ఓట్లు చీలి ఎవరికి లాభం చేకూరుతుందా అన్నది ప్రవ్నార్థకంగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న త్రిముఖ పోరు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి నేతలు సైతం త్రిముఖ పోరు పట్ల అంతర్మథనంలో పడ్డారు.

రేసులో దూసుకుపోతున్న కారు…
బోధన్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి షకీల్ ఎన్నికల రేసులో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఓవైపు చేరికలు మరోవైపు బిఆర్‌ఎస్ అగ్రనేతల ప్రచారంతో నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే షకీల్‌తో పాటు ఆయన సతీమణి అయే షా ఫాతిమా అన్నీ తానై ముందుకు సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో ఓవైపు ఎమ్మెల్యే షకీల్ మరోవైపు ఆయన సతీమణి అయేషా ఫాతిమా సుడిగాలి పర్యటన చేపడుతున్నారు. అధికార బిఆర్‌ఎస్ పార్టీ తరపున సిఎం కెసిఆర్ బహిరంగ సభ నిర్వహించగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానికంగానే ఉండి ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. బోధన్ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎన్నికల ఇంచార్జిగా కవిత ఉండడంతో ఆమె నియోజక వర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. మంత్రి హరీష్ రావు రెంజల్ మండలంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. రెండు మూడు రోజుల్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. రెండు మూడు రోజుల్లో కెటిఆర్ రోడ్ షోలు కార్నర్ మీటింగులు బోధన్‌లో జరగనున్నాయి. ఓవైపు చేరికలు మరోవైపు బహిరంగ సభలు ఇంకోవైపు ఇంటింటి ప్రచారంతో ఎమ్మెల్యే షకీల్ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు.

చేరికలతో కాంగ్రెస్‌లో ఉత్సాహం…
పోటీలో తలపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. నియోజక వర్గంలోని అన్ని గ్రామాలలో ప్రచారంతో ఆయన బిజీగా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరికలు, కొనసాగడంతో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కొత్త ఉత్సాహంతో ప్రచారంలో ముందుకు సాగుతూ చేరికలపై దృష్టి పెట్టారు. ప్రచారం చివరి అంకంలో కాంగ్రెస్ అగ్రనేతలను రప్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పిసిసిఅధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలను బోధన్‌కు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రధానంగా చేరికలపై దృష్టి పెట్టి రాజకీయంగా అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

నువ్వా నేనా అన్నట్లుగా బిజెపి…
నియోజకవర్గంలో బిజెపి ప్రధాన పార్టీలతో నువ్వానేనా అన్నట్లుగా తలపడుతోంది. బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. బిజెపిలో క్యాడర్ నూతన ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఎంపి ధర్మపురి అర్వింద్ బోధన్ నియోజక వర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. బిజెపిలో అసమ్మతి గళాలు లేకపోగా టికెట్ రాకపోయినా మేడపాటి ప్రకాష్‌రెడ్డి బిజెపి అభ్యర్థి మోహన్‌రెడ్డితో చేతులుకలిపి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం పార్టీకి కలిసి వస్తోంది. దాదాపు నియోజక వర్గంలోని అన్ని గ్రామాలలో బిజెపి ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆ పార్టీ అభ్యర్థి మోహన్ రెడ్డి ప్రచారంలో ముందున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News