Monday, December 23, 2024

చాంద్రాయణగుట్టలో అంబరాన్నంటిన బొడ్రాయి సంబరాలు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : పాతబస్తీ చంద్రాయణగుట్ట గ్రామంలో బొడ్రాయి (శ్రీ పోతలింగన్న ) విగ్రహ పునః ప్రతిష్ఠాపనోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో భాగంగా నూతన బొడ్రాయి ప్రతిష్ఠాపన, హోమం, బలగం, బోనాల సమర్పణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అర్చక స్వాములు నిర్ణయించిన ప్రకారం శనివారం రాత్రి సుమూహుర్తమున శాస్త్రోక్త పూజలు, మంగళ వాయిద్యాల నడుమ పోతలింగన్న విగ్రహాన్ని (నూతన బొడ్రాయి)ని పూర్వపు స్థానంలోనే పునః ప్రతిష్టించారు.

తదుపరి హోమ కార్యక్రమం జరిగింది. అర్ధరాత్రి దాటిన తరువాత గ్రామ సరిహద్దులలో బలి ఊరేగింపు నిర్వహించారు. నిర్వాహకులు కొత్తగా ఏర్పాటు చేసిన బొడ్రాయిపై కొబ్బరి, మామిడి ఆకులు, పువ్వులతో అలంకరించిన పందిరి ఏర్పాటు చేశారు. బొడ్రాయిన పసుపు, కుంకుమ, పూలతో అలంకరించారు. వర్షంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా షామియానా వేశారు. ఆతరువాత బోనాల సమర్పణ చేపట్టారు. చాంద్రాయణగుట్ట, కేశవగిరి, ఇందిరానగర్, న్యూ ఇందిరానగర్, దాస్‌స్కూల్, కుమ్మర్‌వాడి, ఆర్‌ఎస్‌ఎస్‌మైదానం, గాంధీ విగ్రహం తదితర బస్తీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి పసుపు, వేపాకులు, మంచినీళ్ళతో సాకపెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక కుమ్మరి సంఘానికి చెందిన మహిళలు 11 బోనాలతో, బ్యాండు మేళాలతో, నలుగురు పోతరాజుల నృత్యాల మధ్య సామూహికంగా బొడ్రాయి వద్దకు చేరుకొని బోనాలను సమర్పించారు.

ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండగకు ముందే చాంద్రాయణగుట్టలో బొడ్రాయి పండగ నిర్వహించటంతో పక్షం రోజుల ముందుగానే ఆ ప్రాంతానికి బోనాల శోభ వచ్చింది. పండగ కోసం తమ బంధువులను, కుమార్తె అల్లుడు, మనవలు మనవరాండ్రను రప్పించుకొని వింధు చేసుకున్నారు. దీంతో చాంద్రాయణగుట్ట కుమ్మర్‌వాడి వీధులు జనసంద్రంగా మారిపోయాయి. వాహనాల రద్దీతో తరచు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాము పుట్టక పూర్వం…చిన్నప్పుడు ఎప్పుడో బొడ్రాయి పండగ చేసినట్లు విన్నాం…ఇన్నాళ్ళకు మళ్ళీ ఇప్పుడే కళ్ళతో చూస్తున్నామని వృద్దులు చర్చించుకోవటం పండగకు గల ప్రాధాన్యత తెలిసొచ్చింది. ఇక నేటి తరం తమ తర్వాతి తరాలకు చెప్పుకునే అవకాశం ఏర్పడింది. బొడ్రాయి పండగ జ్ఞాపకాలను పంచుకొని సంబుర పడునున్నారనటంలో అతిశయోక్తి లేదేమో….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News