Friday, November 22, 2024

సుదీర్ఘకాలం వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తిని కాపాడిన యశోదా ఆసుపత్రి

- Advertisement -
- Advertisement -

సోనూసూద్ సహాయానికి కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు

Body builder save

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రాణాంతక కొవిడ్ బారిన పడి, అత్యంత తీవ్ర బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతూ సుదీర్ఘకాలం వెంటిలేటర్‌పై ఉన్న 32 ఏళ్ల యువ తెలంగాణ బిల్డర్‌కు యశోదా ఆసుపత్రి సరికొత్త జీవితాన్ని ఇచ్చింది. ఆయనకు అందించిన చికిత్స వివరాలను ఆసుపత్రి యాజమాన్యం శనివారం మీడియాకు ప్రకటించింది. మల్కాజ్‌గిరికి చెందిన సుషీల్‌కుమార్ గైక్వాడ్(32) ప్రముఖ బాడీ బిల్డర్‌గా తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ఏప్రిల్ చివరి వారంలో సాధారణ జ్వరం, దగ్గుతో కరోనా వైరస్ బారిన పడి స్థానిక ఆసుపత్రిలో చేరారు. దురదృష్టవషాత్తు అతని ఆరోగ్య పరిస్థితి అప్పటికే క్షీణించింది. దీంతో వెంటనే అతన్ని మలక్‌పేట్ యశోదా ఆసుపత్రికి తరలించారు.

అతన్ని చేర్చుకున్న అత్యవసర విభాగంలో చేర్చుకున్న డాక్టర్లు వెంటిలేషన్, ఊపిరితిత్తుల పనితీరును పరిశీలించారు. సిటీ స్కోరును ఆధారంగా ఊపిరితిత్తులలోని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశారు. 25/25 ఉండటంతో 80 శాతం ఊపిరితిత్తులు పాడైనట్లు వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కేసులకు ఎక్మో ద్వారా వైద్యం అందిస్తారు. కానీ యశోదా క్రిటికల్ కేర్ బృందం, అత్యాధునిక ఇంటర్వేన్షనల్ ఫల్మోనాలజిస్ట్‌ల సహాయంతో 4 నుంచి 6 వారాల పాటు శ్రమించి అతనికి మెరుగైన చికిత్సను అందించినట్లు యశోదా డాక్టర్లు తెలిపారు. చికిత్స ప్రారంభ సమయంలో అతడికి వెంటిలేషన్, ప్రోనింగ్, ట్రాకియోస్టోమీ మార్గదర్శక ఆధారిత అత్యాధునిక వైద్యంతో పాటు ఇంట్యూబేషన్, మెకానికల్ వెంటిలేషన్ అవసరమయ్యాయినట్లు వివరించారు. ప్రస్తుతం అతని ఆరో గ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి పేర్కొంది.

ఈసందర్బంగా యశోదా డైరెక్టర్ డా పవన్‌గోరుకంటి మాట్లాడుతూ.. పరిస్థితి విషమించినప్పటికీ తమ వైద్యుల ప్రత్యేక చొరవతో ఎక్మో సహాయం లేకుండానే అతనికి చికిత్సను అందించినట్లు తెలిపారు. ఇంటెన్సివ్‌కేర్, నర్సింగ్ సంరక్షణతో అతనికి మెరుగైన పురోగతి లభించిందన్నారు. క్రమంగా ఐసియూ నుంచి స్టెప్‌డౌన్‌కు తర్వాత కనీస ఆక్సిజన్ మద్ధతుతో సాధారణ వార్డుకు తరలించామన్నారు. ఒక నెలన్నర రోజుల తర్వాత ఆయన కోలుకోవడం సంతోషకరమైన విషయమని చెప్పారు. సుషీల్‌కుమార్ మాట్లాడుతూ..తాను యశోదాలో చేరేందుకు సహకరించిన సినీనటుడు సోనూసుద్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News