Monday, November 18, 2024

బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి

- Advertisement -
- Advertisement -

ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్‌కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు ) జాషువా డీన్ (45) ఆకస్మికంగా మరణించారు. బోయింగ్ సప్లయర్ అయిన స్పిరిట్ ఏరో సిస్టమ్స్‌లో గతంలో క్వాలిటీ ఆడిటర్‌గా వ్యవహరించిన డీన్ … శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో రెండు వారాల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎక్మో కూడా అందించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇన్‌ఫెక్షన్ వేగంగా విస్తరించడం వల్ల ఆయన మరణించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో లోపాలు బయటపెట్టిన జాన్ బార్నెట్ ఆత్మహత్యకు పాల్పడిన రెండు నెలలకే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బోయింగ్‌కు చెందిన 737 మ్యాక్స్ విమానాల తయారీలో లోపాలను స్పిరిట్ సంస్థ పట్టించుకోవడం లేదని డీన్ ఆందోళన వ్యక్తం చేశారు.

విమాన లోపాలను బయటకు వెల్లడించారన్న కారణంతో ఆయనను గత ఏడాది ఏప్రిల్‌లో ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించారు. మరోవైపు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ తయారీలో ప్రమాణాలు పాటించడం లేదంటూ బెర్నాట్ కూడా సంబంధిత సమాచారాన్ని బహిర్గతం చేశారు. లోపాలు బయటపెట్టినందుకు దావా కూడా ఎదుర్కొన్నారు. దాదాపు 32 ఏళ్ల పాటు బోయింగ్‌లో పనిచేసిన ఆయన 2017లో రిటైర్ అయ్యారు. ఈ ఏడాది మార్చి 9న తనంతట తానే గాయపర్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బోయింగ్ విమానాలు పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఆ కంపెనీకి చెందిన 737 మ్యాక్స్ విమానం డోర్ ఊడింది. అంతకు ముందు ఇండోనేషియా, ఇథియోపియాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో అవే విమానాలు 346 మంది ప్రయాణికుల ప్రాణాలను బలిగొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News