కరీంనగర్: తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి టార్గెట్‌గా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బుధవారం కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థను సందర్శించిన సందర్భంగా బోయినపల్లి ఈ కామెంట్లు చేయడం గమనార్హం. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ఆరోపించారు. కొంత మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ చూస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీ కుట్రలను అరాచకాలను మునుగోడు ప్రజలు గ్రహించారని, ఉప ఎన్నికల్లో టీఆరెఎస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందని స్పష్టం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై దేశ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనతో ఉన్నారని, దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలని ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఎలక్షన్ కోడ్ కారణంగా టీఆరెఎస్ బీఆరెఎస్‌గా మారడానికి మరికొంత సమయం పడుతుందని వెల్లడించారు. గవర్నర్‌లతో రాష్ట్రాలను బీజేపీ ఇబ్బందులకి గురి చేస్తోందని, బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్‌ల ప్రవర్తన బాగా లేదని, బిల్లులు పెండింగ్‌లో ఉండడానికి గవర్నరే కారణమని బోయినపల్లి వినోద్ ఆరోపించారు.