Thursday, January 23, 2025

బిజెపి నేతలు ఇప్పుడేం చెబుతారు?

- Advertisement -
- Advertisement -

ప్రశ్నార్థకమవ్వనున్న
సింగరేణి బొగ్గు గనుల స్థితి
శరవేగంగా సాగుతున్న బొగ్గు గనుల బ్లాకుల వేలం పాటల పరంపర !!
వేలం పాటపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బుకాయింపులు
ప్రైవేటీకరిస్తే ఉద్యోగుల భద్రత సేఫ్టీ ప్రికాషన్స్ పరిస్థితి ఏమిటో?
కార్మిక సంఘాలు, ప్రభుత్వ వర్గాల ఆందోళన
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం బరితెగిస్తోంది. లేదు లేదంటూనే ప్రైవేటీకరణకు వడివిడిగా అడుగులు వేస్తోంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర సర్కారు వాటా 51 శాతం ఉన్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం ప్రైవేటీకరణ అసాధ్యమని ఒక దశలో ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. అది గతం గతః ఇక ఇప్పుడు మాత్రం వేలం తప్పదన్న తీరుగా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటూ వస్తోంది. నిజానికి ఈ ఏడాది మార్చి నెలలోనే ప్రయత్నాలు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచిన బొగ్గు గనుల్లో తెలంగాణలోని మూడు సింగరేణి గనులకు బిడ్లు దాఖలు కాలేదు. మొత్తం 99 గనులను వేలానికి పెట్టగా కేవలం 11 గనులకు మాత్రమే ఈ ఏడాది మార్చి నెలలో బిడ్లు దాఖలు అయ్యాయి. బిడ్లు దాఖలు కాని గనుల వేలం రద్దు అయ్యింది. కాగా తదుపరి వేలంలో వీటిని చేర్చవచ్చని అప్పట్లోనే అధికారులు తెలుపడం గమనార్హం. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎంతగా మొత్తుకుంటున్నా కూడా కేంద్రం తన వైఖరిని మార్చుకోకుండా ముందుకు వెళ్తోంది. నిజానికి గత నెల 12న సింగరేణి ప్రైవేటీకరణ ఎలా చేస్తామని ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు విరుద్ధంగా తాజాగా బొగ్గు బ్లాకుల వేలంతో కేంద్రం మరో మోసానికి సిద్దమవుతోంది. ఈ క్రమంలో అటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఇటు సింగరేణి కార్మిక వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో లేఖ రాసినా మోడీ సర్కారు మాత్రం గనుల వేలానికే సై అంటుండడం గమనార్హం.

ప్రైవేటీకరిస్తే బడా కాంట్రాక్టర్ల చేతికే సింగరేణి .. ధరావత్ మంగీలాల్ , బెల్లంపల్లి ఏరియా కార్పొరేట్ స్క్రక్చర్ కమిటీ మెంబర్
చట్టం ప్రకారం తాము కోల్ బ్లాకులను వేలం వేస్తున్నామని, బహిరంగ వేలంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో సింగరేణి సంస్థ పోటీపడి బొగ్గు గనుల బ్లాకును దక్కించుకోవాలని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అటు పార్లమెంటు నిండు సభలో, ఇటు బహిరంగ ప్రకటన ద్వారా పదేపదే చెబుతున్నారని బెల్లంపల్లి ఏరియా కార్పొరేట్ స్క్రక్చర్ కమిటీ మెంబర్ ధరావత్ మంగీలాల్ “మన తెలంగాణ”తో అన్నారు. దానికి నిదర్శనంగా తాజా టెండర్ షెడ్యూల్ ప్రక్రియ అని, దీనికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏం చెబుతారని ప్రశ్నించారు. బెల్లంపల్లి ఏరియాలో 1562 మంది కార్మికులు పని చేస్తున్నారని ప్రైవేటీకరణ చేస్తే బడా కాంట్రాక్టుల గుప్పిట్లోకి సింగరేణి పోవడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కార్మికుల పక్ష పాతంగా ఉంటూ సింగరేణిలో వచ్చిన లాభాలను కూడా కార్మికులకు పంచుతోందన్నారు. రేపు ప్రైవేటీకరణ జరిగితే కేంద్రం గానీ, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు గానీ ఇలా లాభాలను కార్మికులకు పంచుతాయా? అని ధరావత్ మంగీలాల్ ప్రశ్నించారు.

సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు మోడీ పక్కా స్కెచ్: బోయినపల్లి వినోద్ కుమార్
సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు మోడీ పక్కా స్కెచ్ వేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైఎస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బొగ్గు గనులను వేలం వేసే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని, బొగ్గు గనుల వేలం పాటల పరంపరకు కేంద్ర ప్రభుత్వం టెండర్ షెడ్యూల్ ను తాజాగా ప్రకటించిందని ఆ ప్రకటనలో గుర్తు చేశారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న సుమారు 60వేల మంది కార్మికులు, ఉద్యోగులను రోడ్డు పాలు చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని వినోద్ కుమార్ ఆరోపించారు.

బొగ్గు గనుల బ్లాకులను వేలం వేసేందుకు టెండర్ షెడ్యూల్ ప్రకటించిన విషయాన్ని వినోద్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం కోసం ప్రకటించిన తాజా టెండర్ షెడ్యూల్ ను వినోద్ కుమార్ మీడియాకు విడుదల చేశారు. గత కొద్ది మాసాలుగా బొగ్గు గనుల బ్లాకుల వేలం పాటల పరంపర శరవేగంగా సాగుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జీ..! దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తాను ఈ ఘటనపై ముందే హెచ్చరించానని . అయినా బిజెపి నేతలు బుకాయించారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. తాజాగా సింగరేణి నాలుగు బ్లాక్‌ల వేలానికి తెర తీయడంతో కేంద్ర ప్రభుత్వ అసలు రంగు బట్టబయలైందని వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణిని ప్రైవేటుపరం చేయమని ఒక వైపు చెబుతూనే.. దేశంలోని బొగ్గు గనుల బ్లాకులను వేలం వేస్తూ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో వైపు చేస్తున్న ఈ టెండర్ ప్రక్రియకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం సమాధానం చెబుతారు అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.

ఇటీవల రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు విచ్చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయడం గాని, నిర్వీర్యం చేయడం గాని తాము చేయమని, రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణిలో 51% శాతం వాటా ఉందని, కేంద్ర ప్రభుత్వానికి కేవలం 49 శాతం వాటా ఉందని, అలాంటప్పుడు సింగరేణి సంస్థను తాము ప్రైవేట్ పరం ఎలా చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని, కానీ ఆచరణలో మాత్రం వ్యవహారం అందుకు భిన్నంగా ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. సింగరేణి సంస్థ జోలికి వెళ్ళమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బొగ్గు గనుల వేలంపాటల ప్రక్రియకు ఎక్కడా కూడా పొంతన లేకుండా ఉందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బొగ్గు గనుల బ్లాకులను యదేచ్చగా టెండర్ ప్రక్రియ ద్వారా వేలం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ అసలు రంగు బట్టలు అయిందని వినోద్ కుమార్ మండిపడ్డారు.

గత నవంబర్ 3 వ తేదీ నుంచి ప్రారంభమైన బొగ్గు గనుల బ్లాకుల వేలం పాటల పరంపర వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వ తేదీ వరకు కొనసాగనుందని వినోద్ కుమార్ తెలిపారు. సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చేస్తూనే, వ్యూహాత్మకంగా వ్యవహరించి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా ముందుకు సాగుతోందని వినోద్ కుమార్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ పట్ల అనుసరిస్తున్న అనుచిత వైఖరిని, బొగ్గు గనుల వేలం పాటల పరంపరను ముందుగానే తాను హెచ్చరించినా.. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర బిజెపి నాయకులు బుకాయించారని వినోద్ కుమార్ తెలిపారు. నిజానికి మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 సెక్షన్ 17 ఎ / 11 ఎ ప్రకారం సింగరేణి సంస్థకు ఓపెన్ టెండర్ తో సంబంధం లేకుండా కోల్ బ్లాక్స్ ను రిజర్వ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ అండర్ గ్రౌండ్ అండ్ ఓపెన్ కాస్ట్ కోల్ మైన్స్ ను గోదావరి వ్యాలీ కోల్ ఫీల్ (జివిసిఎఫ్) పరిధిలో కలిగి ఉందని, మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 సెక్షన్ 17 ఎ / 11 ఎ ప్రకారం గోదావరి వ్యాలీ కోల్ ఫీల్ పరిధిలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ సింగరేణి సంస్థకు కోల్ బ్లాక్స్ ను రిజర్వ్ చేసే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించకోవడం లేదని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

గోదావరి వ్యాలీ కోల్ ఫీల్ పరిధిలో ఉన్న కళ్యాణ ఖని, కోయలగూడెం, శ్రావణపల్లి, సత్తుపల్లి కోల్ బ్లాక్స్ ను సింగరేణి సంస్థకు కేటాయించాల్సి ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకగానే సింగరేణి సంస్థ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని, పైగా కోయాల గూడెం కోల్ బ్లాక్ ను ఇప్పటికే వేలం వేసి ప్రైవేట్ సంస్థకు అప్పగించింది అని వినోద్ కుమార్ తెలిపారు. కోల్ బ్లాక్స్ చేతిలో లేకుంటే సింగరేణి సంస్థ ఏం పని చేయాలి అని బోయినపల్లి వినోద్ కుమార్ నిలదీశారు. బొగ్గు గనుల బ్లాకుల వేలం వేసే టెండర్ షెడ్యూల్ గురించి ఇప్పుడేం చెబుతారని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీని, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను ప్రశ్నించారు. బొగ్గు గనుల బ్లాకుల వేలం పాటల పరంపర విషయాన్ని, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న కుట్రను ఇప్పటికైనా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గ్రహించాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇలాంటి కుట్రలను అడ్డుకోవాలని వినోద్ కుమార్ సూచించారు.

సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చేసి నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కోల్ బ్లాక్స్ ను వేలం పాట ద్వారా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ముందుకు సాగుతోందని వినోద్ కుమార్ అన్నారు. ప్రైవేటీకరణకు, వేలం పాటకు మధ్య ఉన్న తేడాను ఇప్పటికైనా బండి సంజయ్ గ్రహించాలని, కళ్ళు తెరిచి వాస్తవాలను తెలుసుకోవాలని వినోద్ కుమార్ అన్నారు. ఇప్పటికే సింగరేణి సంస్థకు బొగ్గు గనుల బ్లాకులు దక్కకుండా ఆగస్ట్ 10వ తేదీ 2022 నాడు నిర్వహించిన వేలం పాటలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కోయలగూడెం-lll కోల్ బ్లాక్ ను ఔరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అప్పగించిందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని వినోద్ కుమార్ ఆరోపించారు. ప్రైవేటీకరణ అనే పదం ఉపయోగించకుండా పక్కా స్కెచ్ వేసి కోల్ బ్లాక్స్ ను వేలం వేస్తూ సింగరేణి సంస్థను పరోక్షంగా మూత వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కోల్ బ్లాకులు లేకుంటే సింగరేణి సంస్థ ఏం పని చేయాలని వినోద్ కుమార్ ప్రశ్నించారు. బొగ్గు గనులు అందుబాటు లేకుంటే సింగరేణి సంస్థ మూతపడే ప్రమాదం ఉందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News