Tuesday, November 5, 2024

కోతల నుంచి నిరంతర వెలుగులు: బోయినపల్లి వినోద్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిత్యం కోతల నుంచి నిరంతరం వెలుగులు అందిస్తూ రాష్ట్రంలో విద్యుత్ ప్రగతి ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతోందని, దేశంలోనే రికార్డు స్థాయిలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా జరుగుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. సోమవారం సిరిసిల్ల పద్మ నాయకా ఫంక్షన్‌హాల్‌లో జరిగిన రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల విద్యుత్ ప్రగతి ఉత్సవాలకు వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఇది రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత అని ఆయన పేర్కొన్నారు.

సమైక్య రాష్ట్రంలో విద్యుత్ రంగం నిర్లక్ష్యానికి గురైందని, అయితే తెలంగాణ సిద్ధించిన తర్వాత అనేక కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించి ఎంతో పురోగతి సాధించామని, ప్రస్తుతం మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా అడుగులు వేస్తున్నామని వినోద్‌కుమార్ తెలిపారు. కొత్తగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు నిర్మించడం వల్ల రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2,140 యూనిట్లకు చేరిందని, ఇది జాతీయ సగటు ( 1,255) కంటే 70 శాతం అధికమని వినోద్‌కుమార్ వివరించారు. సోలార్ పవర్‌లో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని వినోద్‌కుమార్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 74 మెగావాట్ల సోలార్ విద్యుత్ కెపాసిటీ ఉండగా,

తెలంగాణ ఆవిర్భావం తర్వాత సోలార్ ఇన్స్తాల్డ్ కెపాసిటీ 6,274 మెగావాట్లకు పెరిగిందని వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 8.46 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, 27.49 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీల పటిష్టతకు రూ. 97,321 కోట్లు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను విస్తరించడానికి, పటిష్టం చేయడానికి రూ. 97, 321 కోట్లు వెచ్చించినట్లు వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గృహ వ్యవసాయ రంగాల సబ్సిడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,500 కోట్ల విడుదల చేసిందని, విద్యుత్ సరఫరా, ఉత్పత్తి కోసం రూ. 39,321 కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేసిందని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి వంటి బహుళార్ధ ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టుల విద్యుత్ డిమాండ్ మేరకు 6,435 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను నిర్మించడమే కాకుండా

నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన డిమాండ్ కోసం 6,454 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థల నిర్మాణాలు జరుగుతున్నాయని వినోద్‌కుమార్ వెల్లడించారు. భవిష్యత్‌లో అవసరమైన 820 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వినోద్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, సెస్ సంస్థ చైర్మన్ రామారావు, జెడ్పీ చైర్‌పర్సన్ అరుణా రాఘవరెడ్డి, వైస్ చైర్మన్ సిద్దం వేణు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News