ఒకరు మృతి..11 మందికి గాయాలు
రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో గురువారం నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి బొలెరోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మరణించగా మరో 11 మంది గాయపడ్డారు. వాలెవాధి పోలీసు స్టేషన్ పరిధిలోని ఘోటియా గ్రామ సమీపంలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నారాయణ్‌పూర్ నుంచి దంతెవాడను కలిపే నిర్మాణంలో ఉన్న ఒక రోడ్డు కింద నక్సల్స్ మందుపాతర అమర్చి ఎస్‌యువిని పేల్చివేసినట్లు జిల్లా ఎస్‌పి అభిషేక్ పల్లవ తెలిపారు. భద్రతా దళాల వాహనాన్ని లక్షంగా చేసుకున్న నక్సల్స్ పొరపాటున సామాన్య పౌరులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసి ఉంటారని ఆయన చెప్పారు.
ఆ మార్గంలో పోలీసులు నాలుగు చక్రాల వాహనాన్ని ఎన్నడూ ఉపయోగించరని ఎస్‌పి చెప్పారు. వాహనంలోని బాధితులు పొరుగున ఉన్న తెలంగాణకు వెళుతున్నారని, ఈ పేలుడులో ఒక మహిళతో సహా మొత్తం 12 మంది గాయపడ్డారని, వీరిలో ఒకరు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన తెలిపారు. మృతుడిని మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందిన ధన్ సింగ్‌గా గుర్తించినట్లు ఆయన చెప్పారు. బాధితులంతా ఛత్తీస్‌గఢ్‌లోని రాజానందగావ్, బాలాఘాట్‌కు చెందినవారని, ఏదో వ్యక్తిగత పనిమీద వీరంతా తెలంగాణ వెళుతున్నారని ఆయన చెప్పారు.