Monday, January 20, 2025

బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ముంబై : మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు , ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్‌ను ముంబై పోలీస్‌లు ఆదివారం అరెస్ట్ చేశారు. సైబర్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయనను ఛత్తీస్‌గఢ్‌లో కస్టడీ లోకి తీసుకుంది. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. సాహిల్‌కు సిట్ 2023 డిసెంబర్ లోనే సమన్లు జారీ చేసింది. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు.

ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఒక సెలెబ్రిటీగా తాను కేవలం యాప్‌నకు బ్రాండ్ ప్రమోటర్‌గా మాత్రమే పనిచేశానని, చెప్పుకొచ్చారు. ఈ మేరకు 2022 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరినట్టు చెప్పారు. యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ, పోలీస్‌లు మాత్రం ఆయనను బెట్టింగ్ యాప్ సహయజమానిగా చెబుతున్నారు. సాహిల్ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు బెయిల్‌ను నిరాకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. బెట్టింగ్ యాప్ కార్యకలాపాలన్నీ అక్రమం. చాలా పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారింది.

నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించారు. ఫేక్ సిమ్ కార్డులతో సంప్రదింపులు జరిపారు. పిటిషన్‌దారుకు “ది లయన్ బుక్ 247” తో నేరుగా సంబంధం ఉన్నట్టు తేలింది ” అని ధర్మాసనం పేర్కొంది. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన సాహిల్ , స్టైల్, ఎక్స్‌క్యూజ్‌మీ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. సొంతంగా ఓ కంపెనీని స్థాపించి ఫిట్‌నెస్ సప్లిమెంట్స్‌ను విక్రయిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు 15,000 కోట్ల అవినీతి జరిగింది. దాదాపు 67 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లను సృష్టించి క్రికెట్, ఫుట్‌బాల్, తీన్ పత్తీ వంటి ఆటల్లో బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ నిర్వహించారు. దీంట్లోకి సామాన్యులను ఆకర్షించేందుకు సెలబ్రిటీలతో ప్రమోట్ చేయించారు.

దీనిపై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. 2023 నవంబరులో మాతుంగ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను పోలీస్‌లు గత ఏడాది దుబాయ్‌లో కస్టడీ లోకి తీసుకున్నారు. ‘ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ , దీనిపై విచారణ జరుపుతోంది. నకిలీ పత్రాలతో దాదాపు 2000 బోగస్ సిమ్‌లు, 1700 బ్యాంకు ఖాతాలు తీసుకున్నట్టు తేలింది.. బెట్టింగ్‌ల నుంచి వచ్చిన డబ్బును హవాలా , క్రిప్టో మార్గంలో విదేశాలకు తరలించినట్టు గుర్తించారు. ఈ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ వివాహం యూఏఈలో జరిగింది. ఇందుకోసం రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. దీనికి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు ఈడీ గుర్తించింది. ఛత్తీస్‌గఢ్ మాజీ సిఎం భూపేశ్ బఘేల్‌కు సైతం ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యం లోనే ఈ కేసు దేశ వ్యాప్తంగ సంచలనంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News