మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి మైరెంబం కోయిరెంగ్ నివాసంపై తీవ్రవాదులు జరిపిన బాంబు దాడిలో ఒక వృద్ధుడు మరణించగా ఐదుగురు గాయపడ్డారు. తీవ్రవాదులు పేల్చిన రాకెట్ కోయిరెంగ్ ఇంటి ప్రహరీ గోడలోపల పేలగా ఏదో పూజ కోసం ఏర్పాట్లు చేస్తున్న ఒక వృద్ధుడు మరణించాడు. ఒక 13 ఏళ్ల బాలికతోసహా ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఈ జిల్లాలో తీవ్రవాదులు రాకెట్ పేల్చడం ఇది రెండవ ఘటనగా పోలీసులు తెలిపారు.
ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్‌ఎ) ప్రధాన కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ రాకెట్ పేలుడు జరిగింది. 1944 ఏప్రిల్ 14న ఐఎన్‌ఎ సుప్రీం కమాండర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదేశాల మేరకు మొయిరంగ్‌లో భారత గడ్డపై మొటట్మొదటిసారి భారత త్రివర్ణ పతాకాన్ని ఐఎన్‌ఎ లెఫ్టినెంట్ కల్నల్ షౌకత్ అలీ ఎగురవేశారు. కాగా..రాష్ట్ర రాజధానికి 45 కిలోమీటర్ల దూరంలోని ట్రాంగ్‌లావ్‌బీకి చెందిన నివాస ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఒక రాకెట్ పేలుడు సంభవించింది.