హవానా : క్యూబా రాజధాని హవానా లోని లగ్జరీ హోటల్ సరటోగా లో శుక్రవారం గ్యాస్ లీకై పేలుడు సంభవించి 22 మంది మృతి చెందగా, 74 మంది గాయపడ్డారు. వీరిలో 14 మంది పిల్లలు ఉన్నారు. గ్యాస్ ట్యాంక్‌ను రీఫిల్ చేస్తున్నప్పుడు భారీ పేలుడు సంభవించిందని హోటల్ యాజమాన్యం వెల్లడించింది. పేలుడు ధాటికి హోటల్ ఐదు అంతస్థులు ధ్వంసమయ్యాయి. హోటల్ బయట ఉన్న బస్సులు, కార్లు దెబ్బతిన్నాయి. శిధిలాల్లో చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. 96 గదులు గల ఈ సరటోగా హోటల్‌ను 1930 లో నిర్మించారు. దీనికి మరమ్మతులు, పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున టూరిస్టులు ఎవరూ ఉండడం లేదని హవానా గవర్నర్ రెయినాల్డో గార్సియా జపటా చెప్పారు. ఇది బాంబు పేలుడు లేదా దాడి కాదని , ఇది అత్యంత ఘోర విషాదమని అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కేనెల్ ఆవేదన వెలిబుచ్చారు. హోటల్‌కు గ్యాస్ సరఫరా చేస్తున్న ట్రక్కులో పేలుడు జరిగిందని క్యూబా ప్రభుత్వ టివి ఛానల్ వెల్లడించింది. హోటల్ పక్కనున్న స్కూలులోని 300 మంది విద్యార్థులను వెంటనే ఖాళీ చేయించారు. హోటల్‌కు 110 గజాల దూరం వరకూ దిగ్బంధం చేశారు.