Wednesday, January 22, 2025

అల్పపీడన తీవ్ర రూపమే బాంబ్ సైక్లోన్.. అమెరికాలో అల్లకల్లోలం

- Advertisement -
- Advertisement -

అసాధారణ వాతావరణ వైపరీత్యం బాంబ్ సైక్లోన్ అమెరికా కెనడాలను అల్లకల్లోలం చేసింది. కొన్ని దశాబ్దాల తరువాత ఇంతటి ప్రళయ మంచుతుపాన్లు అమెరికాకు ఎదురయ్యాయి. కనీసం 48 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఫ్లైట్ సర్వీసులు రద్దు అయ్యాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆర్కిటిక్ గాలులు బలంగా విజృంభించి సున్నా కన్నా తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలను దిగజార్చాయి. దాదాపు 150మిలియన్ జనం అమెరికాలో తల్లడిల్లి పోయారు.

ఉష్ణమండల తుపాన్ అల్పపీడన ప్రాంతం వేగంగా లోతుగా విస్తరించడాన్ని బాంబోజెనిసిస్ అని అంటారు. వాతావరణ ఒత్తిడి వల్ల అనేక పరిణామాలు ఏర్పడుతుంటాయి. మధ్యాక్షాంశం తుపాన్ వేగంగా తీవ్రమై, కనీసం 24 మిల్లీబార్స్ వరకు తగ్గిస్తే బాంబోజెనిసిస్ ఏర్పడుతుందని చెబుతున్నారు.మిల్లీబార్ అంటే వాతావరణాన్ని కొలిచే ప్రమాణం. ఒక యూనిట్ వాతావరణ ఒత్తిడి బార్‌లో వెయ్యోవంతుకు సమానం. సముద్ర మట్టం పైని వాతావరణ పీడనం 1013 మిల్లీబార్స్‌తో సమానం. శీతాకాలంలో శక్తివంతమైన అల్పపీడన వ్యవస్థలు తీవ్రమైతే బాంబ్ సైక్లోన్ అని పేర్కొనడం సర్వసాధారణమైంది.

ఇవి ఎక్కువగా భారీ మంచుతో, బలమైన పెనుగాలులతో కూడుకుని ఉంటాయి. బాంబ్ సైక్లోన్ అన్న పదం బాంబోజెనెసిస్ నుంచివచ్చింది. అల్పపీడన వ్యవస్థ లోని కేంద్ర పీడనం 24 గంటల్లో కనీసం 24 మిల్లీబార్ల వరకు దిగజారిపోతే బాంబ్ సైక్లోన్ ఏర్పడడానికి దారి తీస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తర అమెరికా సమీపాన 1979 నుంచి 2019 వరకు సంభవించిన ఉష్ణమండలేతర అల్పపీడన తుపాన్లలో 7 శాతం బాంబ్ సైక్లోన్లుగా అంటే ఏటా 18 బాంబ్ సైకోన్ల వంతున సరాసరిన సంభవించినట్టు అధ్యయనంలో తేలింది. నార్తర్న్ ఇలినాయిస్ యూనివర్శిటీ కి చెందిన రాబెర్ట్ ఫ్రిట్జెన్ ఆధ్వర్యంలో 2021లో ఈ పరిశోధన సాగింది.

అమెరికా తూర్పు ప్రాంతంలో ఇది సర్వసాధారణమే అయినా మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా ఇది సంభవించవచ్చు. అమెరికా తూర్పు తీర ప్రాంతాల్లో భారీ మెజార్టీ సంఖ్యలో బాంబ్ సైక్లోన్లు ఏర్పడ్డాయి. సరాసరిన సంవత్సరానికి ఒకటి వంతున బాంబ్ సైక్లోన్ ఏర్పడింది. అమెరికా ఈశాన్య ప్రాంతంలో భారీ ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు సంభవిస్తే బాంబోజెనెసిస్ ఏర్పడుతుంది. సాధారణంగా ఖండాంతర శీతల వాయురాశి (ఎయిర్‌మాస్) , సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల మధ్య అట్లాంటిక్‌లో బాంబోజెనెసిస్ ఏర్పడుతుంది. ఈ విరుద్ధ ఉష్ణోగ్రతల ఫలితంగా అత్యంత శక్తివంతమైన తీవ్రమైన వేగవంతమైన గాలులు లేచి బాంబోజెనెసిస్ ప్రక్రియకు పురిగొల్పుతాయి. బాంబ్‌సైక్లోన్లు సాధారణంగా అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో ఏర్పడుతుంటాయి. అలాగని కాకుండా సంవత్సరంలో ఎప్పుడైనా ఏర్పడవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News