న్యూఢిల్లీ /ఆగ్రా : ఆగ్రా లోని తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపుతో గురువారం ఉదయం తాజ్‌మహల్ కాంప్లెక్సును సెక్యూరిటీ అధికారులు ఖాళీ చేయించారు. బాంబు పెట్టామని ఆగంతకుడు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఫోను చేయడంతో సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమై బాంబు స్కాడ్‌తో అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో తాజ్‌మహల్ సందర్శకులు వెయ్యిమంది వరకు ఉన్నారు. వారందర్నీ ఖాళీ చేయించారు. ఆగంతకుడు తనకు సైనిక నియామకంలో అన్యాయం జరిగిందని ఫోనులో తెలియచేసినట్టు ఆగ్రా ఎస్పీ శివరాం యాదవ్ చెప్పారు.
ఫోను కాల్‌పై విచారణ చేపట్టగా ఆగంతకుడు విమల్‌కుమార్ సింగ్ అని గుర్తించారు.అతడ్ని విచారించడానికి అదుపు లోకి తీసుకున్నామని ఫిరోజాబాద్ ఎడిజి సతీష్ గణేష్ చెప్పారు. సింగ్ కస్గంజ్ లోని పాటియాలి నివాసి అని, ప్రస్తుతం ఫిరోజ్‌బాద్ నర్ఖీ ఏరియాలోని ఒఖ్రా గ్రామంలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. మతిస్థిమితం లేనందున చికిత్స పొందుతున్నాడని, ఎందుకు బాంబు పెట్టినట్టు బెదిరించాడో దర్యాప్తు చేస్తున్నామని ఎడిజి చెప్పారు. గంటా 45 నిమిషాల తరువాత మళ్లీ సందర్శకులను తాజ్‌మహల్‌కు అనుమతించారు.
Bomb scare at Taj Mahal in Agra