బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సిఎం డికె శివకుమార్‌లను లక్షంగా చేసుకుని ప్రభుత్వానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలవరం రేపుతోంది. 2.5 మిలియన్ డాలర్లు చెల్లించకపోతే అనేక చోట్ల పేలుళ్లకు పాల్పడతామని షాహిద్ ఖాన్ 10786 అనే వ్యక్తి పేరుతో సోమవారం ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టు డిప్యూటీ సిఎం శివకుమార్ మంగళవారం పాత్రికేయులకు వెల్లడించారు. మూడు రోజుల క్రితం తాను, ముఖ్యమంత్రి ఈ ఈమెయిల్‌ను అందుకున్నామని, పోలీస్ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.
ఈ ఈమెయిల్ పంపిన షాహిద్‌ఖాన్ మరో ఈమెయిల్ ఐడి తదుపరి కమ్యూనికేషన్ కోసం పంపాడని చెప్పారు. “ఎలెర్ట్ 1మీరు మా మూవీ ట్రయిలర్‌ను చూసే ఉంటారు. 2.5 మిలియన్ డాలర్లు చెల్లించకపోతే కర్ణాటక రాష్ట్రం అంతా బస్సులు, రైళ్లు, టాక్సీలు, ఆలయాలు, హోటళ్లు, పబ్లిక్ స్థలాల్లో భారీ ఎత్తున పేలుళ్లు జరుగుతాయి. ఎలెర్ట్ 2 మరో ట్రయిలర్ చూపించాలనుకుంటున్నాం. మరో పేలుడు అంబారీ ఉత్సవ్ బస్సులో జరుగుతుంది. ఆ బస్సులో పేలుడు తరువాత సోషల్ మీడియా ద్వారా మా డిమాండ్ లేవనెత్తుతాం.
మీకు పంపిన స్క్రీన్‌షాట్లు కూడా సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తాం. పేలుళ్ల గురించి తదుపరి సమాచారం సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తాం” అని ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. ఇది బోగస్సా, బూటకమా, వాస్తవమా, అబద్ధమా లేదా బ్లాక్‌మెయిలరా ఏమిటో తమకు తెలియడం లేదని శివకుమార్ సందేహాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ ఆఫీసర్లకు ఈ మెయిల్ పంపామని, వారు దర్యాప్తు చేపట్టారని శివకుమార్ పేర్కొన్నారు. రామేశ్వరం కేఫ్‌లో తక్కువ తీవ్రత గలిగిన బాంబు పేలుడు సంఘటన జరిగి కొన్ని రోజులు కాకముందే ఈ బెదిరింపు ఈమెయిల్ రావడం కలవరం కలిగిస్తోంది.