Friday, January 10, 2025

తాటాకు చప్పుళ్లకు ముకుతాడు

- Advertisement -
- Advertisement -

విమానాల్లో బాంబు పెట్టామంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న బెదిరింపు కాల్స్, అటు పౌర విమానయాన శాఖను, ఇటు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఉద్దేశంతో చేస్తున్న ఈ బెదిరింపుల వల్ల విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం ఏర్పడటమే కాదు, కొన్ని విమానాలను దారి మళ్లించవలసి వస్తోంది. బాంబు పెట్టినట్లు కాల్ వచ్చిన వెంటనే సదరు విమానాన్ని, విమానాశ్రయాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశాక అది బెదిరింపు మాత్రమేనని తేలుతోంది.

ఈ ప్రహసనమంతా పూర్తయ్యేసరికి నాలుగైదు గంటలు పట్టడం తో ప్రయాణికులు విమానయానమంటేనే బెదిరిపోయే పరిస్థితి దాపురించింది. విమానం గాల్లో ఉండగా, అందులో బాంబు పెట్టామంటూ వస్తున్న బెదిరింపుల వల్ల సదరు విమానాన్ని దగ్గరలోని విమానాశ్రయంలో ల్యాండ్ చేసి, తనిఖీ చేయవలసి వస్తోంది. గత పది రోజుల్లో సుమారు వందకు పైగా బెదిరింపు కాల్స్ రాగా, దర్యాప్తులో ఇవన్నీ నకిలీవేనని నిర్ధారణ అయ్యాయి. ఇలాంటి బెదిరింపు కాల్స్ మన దేశంలోనే కాకుండా, బ్రిటన్, జర్మనీల నుంచి కూడా వస్తున్నట్లు భారత నిఘా సంస్థలు పసిగట్టాయి. డార్క్‌వెబ్ ద్వారా ఈ కాల్స్, ఇ మెయిల్స్‌లో వస్తున్న ఈ బెదిరింపులను పసిగట్టి, నిందితులను సకాలంలో పట్టుకోవడం నిఘా సంస్థలకు సవాల్‌గా మారింది.

సాధారణంగా మానసిక పరిపక్వత లేనివాళ్లు, గతంలో తాము పనిచేసిన పౌర విమానయాన సంస్థపై ద్వేషం పెంచుకున్న మాజీ ఉద్యోగులు, ప్రాంక్ కాల్స్‌కు అలవాటు పడిన యువతీ యువకులు బెదిరింపు కాల్స్ చేస్తూ ఉంటారు. ఇటీవల బెదిరింపు కాల్ చేసి మూడు అంతర్జాతీయ, నాలుగు దేశీయ విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించిన చత్తీస్‌గఢ్‌కు చెందిన 17 ఏళ్ల యువకుడు బహుశా ఇదే కోవకు చెందినవాడై ఉండవచ్చు. సకాలంలో విమానం అందుకోలేని ప్రయాణికులు కూడా బెదిరింపు కాల్స్ చేస్తున్నవారి జాబితాలో ఉంటున్నారు. గత ఏడాది బీహార్ విమానాశ్రయంలో తన లగేజీ తప్పిపోవడంతో విమానాన్ని ఆలస్యం చేసేందుకు ఓ ప్రయాణికుడు బెదిరింపు కాల్ చేసిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత పౌర విమానయాన సంస్థ.. వైమానిక రంగంలో తనదైన ముద్రవేస్తోంది. 33 అంతర్జాతీయ, 150కి పైగా దేశీయ విమానాశ్రయాలతో నిత్యం లక్షలాది మందిని భారత విమానాలు గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. బెదిరింపు కాల్స్ మొదలు కావడానికి ఒక రోజు ముందు, అంటే.. అక్టోబర్ 14న కేవలం ఒక్క రోజులోనే భారత విమానాలు సుమారు ఐదు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చాయంటే ప్రజా రవాణా రంగంలో విమానయాన సంస్థల ప్రాముఖ్యత ఏమిటో అర్ధమవుతుంది. ఇలాంటి దశలో మొదలైన బెదిరింపు కాల్స్ భారత వైమానిక మార్కెట్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బెదిరింపు కాల్స్ వెనుక ఉగ్రకోణం ఉన్నదనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తాజాగా చేసిన ఓ ప్రకటన దీనికి బలం చేకూర్చే విధంగా ఉంది.

ఎయిరిండియా విమానాలను టార్గెట్ చేస్తూ, నవంబర్ 1- 19 తేదీల మధ్య ఆ విమానాలలో ప్రయాణించవద్దంటూ పన్నూ చేసిన హెచ్చరిక ప్రయాణికులలో ఆందోళన రేకెత్తిస్తోంది. వేర్పాటువాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకులలో ఒకడైన ఈ ఉగ్రవాది, ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు. భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించడంతో ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న పన్నూ, భారత్‌ను ఇరకాటంలో పెట్టేందుకు దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోడన్నది గత చరిత్రను తిరగేస్తే తెలుస్తుంది. బెదిరింపు కాల్స్‌కు పాల్పడేవారిని నో ఫ్లై జాబితాలో చేర్చడంతోపాటు జీవితఖైదు విధించేలా చట్టాలను మార్చబోతున్నామంటూ విమానయాన శాఖ మంత్రి చేసిన ప్రకటన ఆహ్వానించదగినదే.

అయితే దీనిని కేవలం వైమానిక రంగానికి మాత్రమే పరిమితం చేయకుండా, ఏ సంస్థకు లేదా ఏ వ్యక్తికి బెదిరింపు కాల్ వచ్చినా, నిందితులకు ఈ చట్టాన్ని వర్తింపజేసేలా చేయడం ఉత్తమం. విమానయాన రంగానికే కాకుండా, రైల్వేలకు, బస్ స్టేషన్లకు, వ్యాపార వాణిజ్య సముదాయాలకు, ఆస్పత్రులకు, విద్యాసంస్థలకు కూడా ఇలాంటి బెదిరింపులు రావడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిన నేపథ్యంలో బెదిరింపు కాల్స్‌కు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపేందుకు సమగ్రమైన చట్టాన్ని తీసుకురావడం శ్రేయస్కరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News