Wednesday, January 22, 2025

ఢిల్లీలో వంద స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :ఢిల్లీ ఎన్‌సిఆర్ ఏరియాలో బుధవారం దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దాంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీస్‌లకు సమాచారం అందించారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ఖాళీ చేయించారు. అనేక ప్రైవేట్ స్కూళ్లకు కూడా బెదిరింపులు వచ్చాయి. బాంబ్ స్కాడ్‌తో పోలీస్‌లు స్కూళ్లలో తనిఖీలు జరిపారు. చివరకు అవి నకిలీ బెదిరింపులే అని ఆందోళన చెందవలసిన పనిలేదని హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. అన్ని స్కూళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడమైందని, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్ధాలు లభించలేదని ఢిల్లీ పోలీస్‌లు తెలియజేశారు.

ప్రజలు ఆందోళన చెందకుండా , ప్రశాంతంగా ఉండాలని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివహరి మీనా కోరారు. అన్ని స్కూళ్లకు ఒకే ఒక చోట నుంచి ఒకే ఒక ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయని, అందులోని కథనం కూడా ఒకేలా ఉందని ఢిల్లీ పోలీస్‌లు చెప్పారు. ఢిల్లీ లోని ద్వారక, చాణక్యపురి, మయూర్ విహార్, వసంత్‌కుంజ్, సాకేత్ స్కూళ్లకు మొదట ఈ బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత రాజధానితోపాటు నోయిడా లోని దాదాపు 100 పాఠశాలలకు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. కొన్ని స్కూళ్లలో ఈ రోజు పరీక్షలు జరుగుతున్నాయి. బెదిరింపుల కారణంగా వాటిని మధ్య లోనే ఆపి వేసి విద్యార్థులను ఇంటికి పంపించారు.

తల్లిదండ్రులకు విద్యామంత్రి ఆతిశీ విజ్ఞప్తి
విద్యార్థుల తల్లిదండ్రులు ఈ బెదిరింపులకు ఆందోళన చెందవద్దని ఢిల్లీ విద్యామంత్రి ఆతిశీ విజ్ఞప్తి చేశారు. స్కూళ్ల ఆవరణలన్నీ ఢిల్లీ పోలీస్‌లు తనిఖీ చేశారని, విద్యార్థులను ఖాళీ చేయించి ఇళ్లకు పంపడమైందని చెప్పారు. ఏ స్కూలులో కూడా ఇంతవరకు ఏదీ దొరకలేదని పేర్కొన్నారు. స్కూళ్ల వద్ద అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. బాంబు స్కాడ్‌లు, స్కూళ్లలో సోదాలు సాగిస్తున్నారు.

బాంబు బెదిరింపులు ఎక్కడ నుంచో బయటపడింది : ఎల్‌జి సక్సేనా
ఈమెయిళ్ల ద్వారా బాంబు బెదిరింపులు ఎక్కడ నుంచి వచ్చాయో బయటపడిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా వెల్లడించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించిన నిందితులు ఎవరైనా క్షమించేది లేదని ,కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. సక్సేనా మోడల్ టౌన్ ఏరియా లోని డిఎవి స్కూలును సందర్శించారు. ఢిల్లీ పోలీస్‌లు వెంటనే స్పందించి ఆ ప్రాంతమంతా దిగ్బంధం చేశారని చెప్పారు. బాంబు డిస్పోజల్, డాగ్‌స్కాడ్లతో తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. అంతకు ముందు ఈ బెదిరింపులపై తక్షణం దర్యాప్తు చేపట్టాలని సమగ్ర నివేదిక అందించాలని పోలీస్ కమిషనర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News