Wednesday, October 16, 2024

ముంబయిలో మూడు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదరింపులు

- Advertisement -
- Advertisement -

బూటకంగా తనిఖీల్లో తేలిన వైనం
ఒక విమానం ఢిల్లీకి మళ్లింపు
ముంబయి : ముంబయి నుంచి బయలుదేరే మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవారం బాంబు బెదరింపులు వచ్చాయి. న్యూయార్క్ కు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానాన్ని న్యూఢిల్లీకి మళ్లించి ప్రయాణ సమయాన్ని మార్చగా, ఇండిగో సంస్థ నడిపే తక్కిన రెండు విమానాలు అనేక గంటలపాటు ఆలస్యం అయ్యాయి. విమానాలు దేనిలోను అనుమానాస్పద వస్తువు ఏదీ కనిపించలేదని పోలీస్ అధికారులు వెల్లడించారు.

‘సోమవారం (14న) ముంబయి నుంచి జెఎఫ్‌కె (న్యూయార్క్)కు నడిచే ఫ్లైట్ ఎఐ 119కి నిర్దిష్ట భద్రత అలర్ట్ అందింది. ప్రభుత్వ భద్రత నియంత్రణ కమిటీ ఆదేశాలను అనుసరించి (దానిని) ఢిల్లీకి మళ్లించడమైంది’ అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలియజేసింది. ‘ఈ అనూహ్య అంతరాయం వల్ల మా అతిథులకు కలిగిన అసౌకర్యాన్ని తగ్గించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు’ అని సంస్థ తెలిపింది. విమానంలో ఉన్న మొత్తం 258 మందినీ దించివేసి, భద్రత ప్రక్రియకు హాజరు పరచినట్లు సంస్థ తెలియజేసింది. విమానంలో 239 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. ఆ విమానం మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరుతుందని ఎయిర్ ఇండియా వెల్లడించింది. మైక్రోబ్లాగింగ్ వేదిక ‘ఎక్స్’ ద్వారా ఆ బెదరింపు అందినట్లు, దానిని పరిశీలిస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు ఢిల్లీ విమానాశ్రయాన్ని సందర్శించారు. రెండు ఇండిగో విమానాలకు కూడా బయలుదేరే ముందు బాంబు బెదరింపులు వచ్చాయి. వాటిలో ఒకటి ముస్కట్‌కు, రెండవది జెడ్డాకు వెళ్లవలసి ఉంది. భద్రత పరమైన తనిఖీల నిమిత్తం వాటిని ఏకాంత ప్రదేశాలకు తరలించారు.

రెండు విమానాలను పూర్తిగా తనిఖీ చేసినట్లు, ‘(అనుమానాస్పద వస్తువు) ఏదీ కనిపించలేదు’ అని ముంబయి పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఇండిగో ఒక ప్రకటనలో తమ విమానాలకు అందిన బాంబు బెదరింపుల గురించి తెలియజేసింది. ముస్కట్‌కు సోమవారం తెల్లవారు జామున 2 గంటలకు బయలుదేరవలసిన విమానం ఏడు గంటలకు పైగా ఆలస్యం అనంతరం సోమవారం ఉదయం 9.15 గంటలకు బయలుదేరినట్లు తెలియవచ్చింది. జెడ్డా విమానం కూడా పది గంటలకు పైగా ఆలస్యంగా బయలుదేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News