ముంబయి: ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితునిగా ఉన్న విప్లవ కవి వరవరరావుకు రెండు పూచీకత్తుల స్థానంలో తాత్కాలికంగా నగదు పూచీకత్తు సమర్పించి బెయిలు పొందడానికి బొంబాయి హైకోర్టు అనుమతించింది. అనారోగ్యంతో బాధపడుతున్న 82 సంవత్సరాల వరవరరావుకు బొంబాయి హైకోర్టు గత వారం వైద్య కారణాలపై ఆరునెలల పాటు బెయిల్ మంజూరు చేసింది. అయితే రూ. 50 వేల వ్యక్తిగత బాండుతోపాటు అదే మొత్తంతో కూడిన రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కాగా, రెండు పూచీకత్తులు సమర్పించే ప్రక్రియలో జాప్యం అవుతున్న కారణంగా వెంటనే తన విడుదల కోసం నగదు పూచీకత్తుకు అనుమతించాలని గత నవంబర్ నుంచి నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరవరరావు కోర్టుకు విన్నవించుకున్నారు. సోమవారం దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మనీష్ పిటాలేలతో కూడిన డివిజన్ బెంచ్ రెండు పూచీకత్తులను సమర్పించడానికి ఏప్రిల్ 5వరకు వరవరరావుకు అనుమతి నివ్వడంతోపాటు రూ.50 వేల నగదు పూచీకత్తుపై విడుదల చేయడానికి అనుమతించింది.
Bombay HC Allows Varavara Rao to furnish Cash surety