ముంబై: ఎల్గార్ పరిషద్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడైన విప్లవ కవి వరవరరావుకు గతంలో మంజూరు చేసిన మెడికల్ బెయిల్‌ను మార్చి 3వ తేదీ వరకు బొంబాయి హైకోర్టు శనివారం పొడిగించింది. గత ఏడాది ఫిబ్రవరిలో బొంబాయి హైకోర్టు ఆరోగ్య కారణాలపైన 82 సంవత్సరాల వరవరరావుకు బెయిల్ మంజూరు చేసింది. ఆయన ముంబైను విడిచివెళ్లరాదని కోర్టు ఆదేశించింది. కాగా.. తదనంతరం ఆయన బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా తనకు శాశ్వత బెయిల్‌ను మంజూరు చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 2021 సెప్టెంబర్ నుంచి హైకోర్టు ఆయనకు అనేక పర్యాయాలు బెయిల్ పొడిగించింది. తాజాగా..శనివారం వరవరరావు తరఫు న్యాయవాదులు మరోసారి బెయిల్ పొడిగింపు కోరుతూ జస్టిస్ ఎస్‌బి షుక్రె, జస్టిస్ ఎకె బోర్కర్‌తో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావు తన స్వరాష్ట్రం తెలంగాణకు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇచ్చేలా బెయిల్ షరతులు సవరించాలని న్యాయవాదులు కోరగా దీనిపై మార్చి 1న విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. వరవరరావుకు జైలులో లొంగిపోవలసిన గడువును మార్చి 3 వరకు కోర్టు పొడిగించింది.