ముంబయి: ఎల్గర్ పరిషద్, మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రస్తుతం మెడికల్ బెయిల్‌పై ఉన్న విప్లవ కవి వరవర రావు బెయిల్‌ను బాంబే హైకోర్టు డిసెంబర్ 2 వరకు పొడిగించింది. తీవ్ర అనారోగ్యంతో బాధనడుతున్న 83 ఏళ్ల వరవరరావుకు వైద్య చికిత్స చేయించుకోవడం కోసం బాంబే హైకోర్టు ఏడాది ఫిబ్రవరి 22న ఆరు నెలల మెడికల్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయన సెప్టెంబర్ 5న తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి సరెండర్ కావలసి ఉండింది. అయితే తన మెడికల్ బెయిల్‌ను పొడిగించాల్సిందిగా వరవర రావు తన లాయర్లు సత్యనారాయణన్, ఆనంద్ గ్రోవర్‌ల ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాకుండా బెయిల్‌పై ఉన్నప్పుడు తన స్వస్థలమైన హైదరాబాద్‌లో ఉండడానికి అనుమతించాలని కూడా ఆయన కోరారు.
కాగా బెయిల్‌పై ఉన్న సమయంలో వరవరరావు ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స కోసం ఈ నెల 6నుంచి 16 వరకు ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందని గురువారం పిటిషన్‌పై విచారణ సందర్భంగా గ్రోవర్ న్యాయమూర్తులు నితిన్ జమ్‌దార్, ఎస్‌వి కొత్వాల్‌లతో కూడిన బెంచ్‌కి తెలిపారు. అందువల్ల ఆయన మెడికల్ బెయిల్‌ను మరో నాలుగు నెలలు పొడిగించాలని కోరారు. అయితే దీన్ని వ్యతిరేకించిన ఎన్‌ఐఎ తరఫు న్యాయవాది వరవర రావు ప్రస్తుతం తన మెయిల్ పొడిగింపునకు మాత్రమే పరిమితం కావాలని, మిగతా విషయాల కోసం విడిగా మరో పిటిషన్ దాఖలు చేయాలని అన్నారు. కాగా వరవర రావు తాజా ఆరోగ్య పరిస్థితిపై ఈ నెల 29 నాటికి (తదుపరి విచారణ తేదీ)నివేదిక సమర్పించాలని నానావతి ఆస్పత్రిని ఆదేశించిన బెంచ్ ఆయన వచ్చే నెల 2 వరకు నవీ ముంబయిలోని తలోజా జైలు అధికారుల ముందు లొంగి పోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది.