Thursday, January 23, 2025

మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

ముంబై: అవినీతి కేసులో సిబిఐ చేపట్టిన దర్యాప్తులో ఎన్‌సిపి నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సోమవారం బాంబే హైకోర్టు బెయిల్ మంజూరుచేసింది. అయితే సుప్రీంకోర్టులో దానిని సవాలు చేయడానికి తమకు కొంత సమయం కావాలని కోరడంతో ఆ ఉత్తర్వును హైకోర్టు 10 రోజుల పాటు నిలిపి ఉంచింది. దాంతో దేశ్‌ముఖ్ జైలు నుంచి ప్రస్తుతానికి విడుదల కాలేడు. ఇరువైపుల వాదనలు విన్నాక జస్టిస్ ఎంఎస్. కార్నిక్ ఏకసభ్య ధర్మాసనం దేశ్‌ముఖ్ బెయిల్‌ను అనుమతించింది. ప్రస్తుతం ఆయన జుడిషియల్ కస్టడీలో, ముంబైలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో ఉన్నారు.

గత నెల ప్రత్యేక సిబిఐ కోర్టు తన బెయిల్ వినతిని తిరస్కరించడంతో దేశ్‌ముఖ్(74) హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వైద్య కారణాల రీత్యా, మెరిట్స్ ఆధారంగాను బెయిల్‌ను కోరారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన ఆయన గత ఏడాది నవంబర్ నుంచి కారాగారంలో ఉన్నారు. ఆయనను మనీ లాండరింగ్ కేసు కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) అరెస్టు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవినీతి కేసు కింద కూడా ఆయనని సిబిఐ అరెస్టు చేసింది. ఆయనకు ఈడి కేసులో గత నెల హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అవినీతి కేసులో దేశ్‌ముఖ్ పెట్టుకున్న బెయిల్ వినతిని ప్రత్యేక సిబిఐ కోర్టు తిరస్కరించింది. ప్రాథమిక సాక్షాధారాలు అతడికి వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంది.

నాడు హోమ్ మంత్రిగా ఉన్న దేశ్‌ముఖ్ ముంబైలోని బారులు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ. 100 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టారని ఐపిఎస్ అధికారి పరమ్ వీర్ సింగ్ 2021 మార్చిలో ఆరోపించారు. దాంతో దేశ్‌ముఖ్‌పై ప్రాథమిక దర్యాప్తు జరపాలని హైకోర్టు 2021 ఏప్రిల్‌లో సిబిఐని ఆదేశించింది. దానిఫలితంగా అనిల్ దేశ్‌ముఖ్, ఆయన అనుచరులు అవినీతికి పాల్పడ్డారని, అధికారాన్ని దుర్వినియోగం చేశారని సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News