ఎమర్జెన్సీ సినిమా విడుదలకు అత్యవసర ఆదేశాలు ఇవ్వడం కుదరదని బొంబాయి హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతిని పరిశీలించాలని , ఈ నెల 18 వరకైనా విషయాన్ని తేల్చాలని పేర్కొంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా తమ ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. నటి, బిజెపి ఎంపి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో అత్యంత సున్నితమైన, సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయని, మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొంటూ కొన్ని సంస్థలు ఈ సినిమా విడుదల కోరుతూ పిటిషన్లు దాఖలు చేశాయి. సంబంధిత విషయంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సెన్సార్ బోర్డుకు ఆదేశాలు వెలువరించింది. సినిమాకు ప్రదర్శన అనుమతిని ఇచ్చేముందు వెలువడ్డ అభ్యంతరాలను పరిశీలించాలని సెన్సార్ బోర్డుకు తెలిపింది.
ఈ విషయంపై బొంబాయి హైకోర్టులోనూ కేసు విచారణ సాగుతోంది. మధ్యప్రదేశ్ హైకోర్టు వెలువరించిన ఆదేశాల నేపథ్యంలో తాము విడుదలకు వెంటనే ఉత్తర్వులు వెలువరించడం కుదరదని, అయితే సెన్సార్ బోర్డు నుంచి తక్షణ స్పందనకు సూచనలు వెలువరిస్తామని బొంబాయి హైకోర్టు తెలిపింది. న్యాయమూర్తులు బిపి కోలాబావాల్లా , ఫిర్దోష్ పూనీవాలాతో కూడిన ధర్మాసనం నుంచి విడుదలపై నిర్థిష్ట ఆదేశాలు వెలువడకపోవడంతో సినిమా నిర్మాతలకు నిరాశే ఎదురైంది. ఈ నెల 6వ తేదీ శుక్రవారం విడుదల కావల్సిన ఈ సినిమా ఇప్పటి పరిణామాలతో ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సినిమా విడుదలకు సెన్సార్ బోర్డుకు ఆదేశాలు వెలువరించాలని బొంబాయి హైకోర్టును సినిమా నిర్మాణ బాధ్యతల్లోని జి ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ ఆశ్రయించింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌తో సిద్ధంగా ఉందని,
అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే భయంతో దీనిని జారీ చేయడం లేదని నిర్మాతలు కోర్టుకు తెలియచేసుకున్నారు. అయితే వెనువెంటనే సినిమా విడుదలకు ఉపశమన ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొనడంపై నటి కంగనా రనౌత్ స్పందించారు. తన సినిమా ఎమర్జెన్సీకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకుండా తొక్కిపెడుతోందని విచారణ క్రమంలో హైకోర్టు తీవ్ర స్థాయిలోనే మండిపడిందని రనౌత్ తెలిపారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు లేకుండా ఉంటే తాము వెంటనే సినిమా విడుదల గురించి ఇప్పటికిప్పుడు సెన్సార్ బోర్డుకు ఉత్తర్వులు వెలువరించేవారమని ధర్మాసనం పేర్కొందని కంగనా చెప్పారు.