ముంబయి: తమ అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా, ఆయన సహాయకుడు ర్యాన్‌థోర్పే వేసిన పిటిషన్లపై బాంబే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ అంశంలో సోమవారం నిందితులతోపాటు ముంబయి నేర విభాగం తరఫున వాదనలు విన్న సింగిల్‌జడ్జి బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. అశ్లీల చిత్రాలు నిర్మించి పంపిణీ చేశారన్న ఆరోపణలతో బాలీవుడ్ నటి శిల్పాషెట్టి భర్త రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు జులై 19న అరెస్ట్ చేశారు. జులై 20న కుంద్రా సంస్థలోని ఐటి చీఫ్ థోర్పేను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ తమను పోలీసులు అరెస్ట్ చేసిన తీరు చట్ట విరుద్ధంగా ఉన్నదంటూ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై జస్టిస్ ఎఎస్ గడ్కరీ ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
సిఆర్‌పిసిలోని సెక్షన్ 41ఎ ప్రకారం నిందితులకు నోటీసులు జారీ చేయకుండా అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణాకామత్‌పాయి ప్రతివాదన చేశారు. నిందితులిద్దరికీ అరెస్ట్‌కు ముందు నోటీసులు జారీ చేసినట్టు పాయి తెలిపారు. అయితే, నోటీసును స్వీకరించేందుకు కుంద్రా నిరాకరించారని, థోర్పే అంగీకరించారని పాయి కోర్టు దృష్టికి తెచ్చారు. వారి కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు నిందితులు సహకరించలేదని, సాక్షాలను చెరిపేశారని, డేటా ఏమేరకు మాయం చేశారన్నదానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని పాయి తెలిపారు. సాక్షాలను చెరిపేస్తుంటే దర్యాప్తు ఏజెన్సీ మౌనంగా ఉండాలా..? అని ఆమె ప్రశ్నించారు.
కుంద్రా ఆఫీస్ నుంచి 68 పోర్న్ వీడియోలున్న ల్యాప్‌టాప్‌ను పోలీసులు జప్తు చేశారని ఆమె తెలిపారు. స్టోరేజ్ ఏరియా నెట్‌వర్క్ నుంచి జప్తు చేసిన 51 వీడియోలకు ఇవి అదనమని ఆమె పేర్కొన్నారు. థోర్పేకు నోటీసు ఇచ్చారని.. అయితే, ఆయన నుంచి ప్రతిస్పందన తీసుకోకుండానే అరెస్ట్ చేశారని ఆయన తరఫు న్యాయవాది అభినవ్‌చంద్రచూడ్ కోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు కుంద్రా యాంటిసిపేటరీ బెయిల్ కోసం వేసిన పిటిషన్‌పై సెషన్స్ కోర్టు కూడా తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
ప్రైవసీని గౌరవించండి
మీడియా విచారణను అనుమతించం: శిల్పాషెట్టి
రాజ్‌కుంద్రా అరెస్ట్‌పై శిల్పాషెట్టి మౌనం వీడారు. ఇన్‌స్టాగ్రాం ద్వారా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కుటుంబపు ప్రైవసీని(వ్యక్తిగత గోప్యతను) గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. తన పిల్లలను దృష్టిలో ఉంచుకొని వ్యాఖ్యలు చేయడంలో నియంత్రణ పాటించాలని ఆమె సూచించారు. అరకొర సమాచారంతో వ్యాఖ్యలు చేయకండి. మీడియా విచారణను అనుమతించమన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోనీయండి అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. తనకు ముంబయి పోలీసులు, న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉన్నదన్నారు. కుమారుడు వియాన్(9), కూతురు సమీష(ఏడాది)తో కుంద్రా కలిసి ఉన్న ఫోటోను ఆమె షేర్ చేశారు. తన కుటుంబాన్ని అగౌరవపరిచే కథనాలు ప్రచురించకుండా మీడియాను ఆదేశించాలంటూ షెట్టీ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే. మీడియా స్వేచ్ఛపై జోక్యం చేసుకోవడంలో తమకూ పరిమితులున్నాయని కోర్టు ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది.