ముంబై: 2001లో ముంబైలోని హోటల్ వ్యాపారి జయశెట్టి హత్యకేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు విధించిన జీవిత ఖైదును బాంబే హైకోర్టు బుధవారం సస్పెండ్ చేసింది, ఈ కేసులో అతనికి బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే , పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఛోటా రాజన్‌కు బెయిల్ కోసం రూ. 1 లక్ష బాండ్ అందించాలని ఆదేశించింది. అయితే ఇతర క్రిమినల్ కేసులకు సంబంధించి ఛోటా రాజన్ జైల్లోనే ఉండనున్నాడు.
హోటల్ యజమాని హత్య కేసులో మే నెలలో ఛోటా రాజన్‌ను దోషిగా నిర్ధారించిన ప్రత్యేక కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ శిక్షపై రాజన్ బాంబే హైకోర్టులో అప్పీలు చేశాడు. శిక్షను సస్పెండ్ చేయాలని, తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని గ్యాంగ్ స్టర్ కోరాడు. ప్రముఖ క్రైమ్ రిపోర్టర్ జె డే హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న రాజన్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు. అతడిని 2015లో ఇండోనేషియాలో అరెస్టు చేసి ముంబైకి తీసుకొచ్చారు. దీంతో ఆయనపై పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ సిబిఐకి బదిలీ అయ్యాయి.